Share News

బడుల్లో సమస్యల గంట

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:54 PM

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 11: ‘మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను మనఊరు-మనబడి పథకం ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

బడుల్లో సమస్యల గంట
శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నఅక్కన్నపేట మండలం జనగామ ప్రభుత్వ పాఠశాల భవనం

నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

సర్కారు స్కూళ్లలో సమస్యల తిష్ట

లక్ష్యం చేరని ‘మనఊరు-మనబడి’

పలుచోట్లా మరుగుదొడ్లు, తాగునీటి ఇబ్బందులు

శిథిలావస్థకు చేరిన గదుల్లోనే తరగతులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 11: ‘మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను మనఊరు-మనబడి పథకం ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అదనపు గదులు నిర్మాణంలో ఉండగానే బిల్లులు రాకపోవడంతో పనులను అసంపూర్తిగా వదిలేశారు. తరగతుల బోధనకు ఈ భవనం ఉపయోగపడదు. కొత్తగా నల్లాలు కూడా బిగించలేదు.’

‘తొగుట మండలం గోవర్ధనగిరి ప్రాథమికోన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. నిత్యం స్ల్లాబ్‌ పెచ్చులూడి విద్యార్థులపై పడే పరిస్థితి ఉండేది. వర్షం పడినప్పుడు విద్యార్థులను ఇతర గదుల్లోకి పంపిస్తుంటారు.’

ధర్మారం, గోవర్ధనగిరి పాఠశాలల్లోనే కాదు. జిల్లాలోని పలుచోట్లా ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ప్రస్తుత ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ సవాలక్ష కారణాలతో ఈ పథకం లక్ష్యాన్ని చేరలేకపోయింది. కొన్ని చోట్లా ఆశించిన ఫలితాలు కనిపించగా.. చాలా పాఠశాలల్లో అసంపూర్తిగా.. నత్తనడకన.. ప్రగతికి దూరంగా సాగుతున్నాయి.

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాల సంఖ్య 1,018కు చేరాయి. ఇందులో 814 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఇతర పనులు చేయుస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.34.80 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటివరకు రూ.8.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 375 పాఠశాలల్లో పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ డ్యూయల్‌ డెస్కులు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, పాఠశాలలకు రంగులు వేసే కార్యక్రమాన్ని 20వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. మరోపక్క పాఠశాలలు పునఃప్రారంభం నాటికే యూనిఫాంలు అందిస్తామని చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులకు యూనిఫామ్‌ రాలేదు. ఒక జత మాత్రమే పాఠశాలలకు చేరినట్లుగా తెలుస్తోంది.

పనుల్లో జాప్యం

పాఠశాలల్లో చేపట్టిన అత్యవసర పనుల్లోనూ తీవ్ర జాప్యం జరిగింది. వేసవి సెలవులు కావడంతో చకచకా పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని భావించారు. నిధుల లోపంతోపాటు ఎన్నికల నిర్వహణ ఒక కారణమైంది. కొన్నిచోట్లా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ జరిగింది. గత నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. ఈ ప్రభావం మరమ్మతులపై పడింది. ఇక అధికారులకు ఎన్నికల విధుల భారం ఉండడంతో పాఠశాలల ప్రగతి పనులపై సరైన దృష్టి పెట్టలేకపోయారు. దీంతో పాఠశాలల ప్రారంభానికి అన్ని స్కూళ్లు సిద్ధం కాలేకపోయాయి. కనీస అవసరాలైన మరుగుదొడ్లు, కుళాయిలు, విద్యుత్‌ సౌకర్యాలు అందుబాటులో లేని పాఠశాలలూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కనీసం వీటినైనా ఈనెలాఖరులోగా పూర్తి చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:54 PM