Share News

ఆస్పత్రి.. ఓపీ కోసమేనా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:00 AM

గజ్వేల్‌ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అందని ఐపీ సేవలు రూ.27.35కోట్లతో నూతన ఆస్పత్రి నిర్మాణం పరికరాలు లేక అందుబాటులోకి రాని కొత్త భవనం

ఆస్పత్రి.. ఓపీ కోసమేనా?
గజ్వేల్‌ పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రి

గజ్వేల్‌, మార్చి 26: గజ్వేల్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రి భవనం కేవలం ఓపీ కోసమే అన్నట్లుంది. హంగూ, ఆర్భాటంతో గజ్వేల్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న పాత ఆస్పత్రిని కూల్చి, నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి ఉత్సవ విగ్రహంలా మారింది. గత ప్రభుత్వం రూ.27.35 కోట్లతో నిర్మించిన భవనంలో వసతులు కల్పించకపోవడంతో కేవలం ఓపీకి మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆయా విభాగాలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, 2019, డిసెంబరు 11న అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 2023 అక్టోబరు 3న అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భవనాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిని ప్రారంభించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఓపీకి తప్ప ప్రసూతిలకు వినియోగించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నూతన భవనంలో ఓటీ, లేబర్‌ రూమ్‌లో కావాల్సిన పరికరాలు పూర్తిస్థాయిలో సమకూరలేదు.

ఇరుకు గదుల్లోనే వైద్య సేవలు

ప్రస్తుత జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండగా.. హైరిస్క్‌ కేంద్రం జిల్లా ఆస్పత్రిలోనే కొనసాగుతున్నది. దీంతో ఇరుకు గదుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతీ నెల దాదాపు 350 డెలీవరీలు జరుగుతుండగా, ప్రతి రోజు వంద మందికి పైగా గర్భిణులు వైద్య సేవల నిమిత్తం వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీరోజు ఆస్పత్రి రద్దీ ఉంటున్నది. నూతన భవనంలోకి ఆస్పత్రిని తరలిస్తే ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు జిల్లా వైద్యాధికారులు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఆయా పరికరాలను విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:00 AM