Share News

అడ్డగోలుగా వెంచర్లు

ABN , Publish Date - May 26 , 2024 | 11:19 PM

రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా

అడ్డగోలుగా వెంచర్లు

చెరువు ఎఫ్‌టీఎల్‌ భూములను ఆక్రమించి లేఅవుట్లు

నాలా కన్వర్షన్‌ లేకుండానే వ్యవసాయ భూముల్లో ఏర్పాటు

వెంచర్ల అభివృద్ధికి అసైన్డ్‌ ల్యాండ్‌ నుంచి మట్టి తరలింపు

కొండాపూర్‌/గుమ్మడిదల/మనోహరాబాద్‌, మే 26 : వ్యవసాయ భూములు.. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో యథేచ్ఛగా వెంచర్లు వెలుస్తున్నాయి. నిబంధనలకు పాతర వేసి అనుమతలు లేకుండానే ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్ల అభివృద్ధికి అసైన్డ్‌ భూముల్లోని మట్టిని తోడేస్తున్నారు. దారి కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. కాసుల కక్కుర్తితో వెంచర్ల పేరిట రియల్‌ మాఫియా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం.

మనోహరాబాద్‌లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో..

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ శివారులోని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లే దారిలో రామాయపల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ ఏటా వర్షకాలంలో మనోహరాబాద్‌ ఎల్లమ్మచెరువు నిండి, ఈ వెంచర్‌ ద్వారానే రామాయపల్లి చెరువులోకి నీరు చేరుతుంది. అమాయకులకు తక్కువ రేటుకు ఈ వెంచర్లను అంటగంటి చేతులు దులుపుకుంటున్నారు. అసలు విషయం తెలిసే నాటికి బాధితులకు వెంచర్ల డెవలపర్లు ముఖం చాటేస్తున్నారు. మనోహరాబాద్‌తో పాటు మండలంలోని కాళ్లకాల్‌, కూచారం గ్రామాల్లోనూ ఎఫ్‌టీఎల్‌ భూమి, కుంటలు, చెరువులు, కాలువల స్థలాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. బడా నాయకుల అండతో రియల్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్లపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసైన్డ్‌ భూమి వెంచర్‌కు రోడ్డు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మన్‌సాన్‌పల్లి, మునిదేవునిపల్లి గ్రామ పంచాయతీలో రియల్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వెంచర్ల అభివద్ధి పేరిట అసైన్డ్‌ భూములకు ఎసరు పెడుతున్నారు. మునిదేవునిపల్లి ఏర్పాటు చేసిన వెంచర్‌కు మన్‌సాన్‌ల్లి శివారులోని అసైన్డ్‌ భూమి నుంచే రోడ్డు వేశారు. అంతేకాకుండా వెంచర్‌కు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇదే వెంచర్‌ అభివృద్ధికి అసైన్డ్‌ భూమి నుంచి మట్టిని తరలిస్తున్నారు. రెండు గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూమిని ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా వెంచర్‌ పనులు చేస్తుండడంతో రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు డెవలపర్లకు నోటీసులను ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం విషయం తెలిసిందని, ప్రస్తుతం తాము వివిధ పనుల్లో బిజీగా ఉన్నామని, పరిశీలించి చర్యలు తీసుకుంటామంటున్నారు. అక్రమ మట్టి తరలింపు, వ్యవసాయ భూమిలో వ్యవసాయేతర పనులపై రెవెన్యూ శాఖను వివరణ కోరగా ఉన్నతాధికారితో బిజీగా ఉన్నామని, ఏది చూడాలన్న ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చంటూ సమాధానం ఇస్తున్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక రియల్‌ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుమ్మడిదల మండలంలో పుట్టగొడుగుల్లా

హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న గుమ్మడిదల మండలంపై రియల్‌ వ్యాపారుల కన్ను పడింది. స్థానిక నాయకుల అండదండలతో మండలంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి అనుమతులు లేకుండానే వెంచర్లను నిర్మిస్తున్నారు. అన్నారం, దోమడుగు, గుమ్మడిదల, రామ్‌రెడ్డిబాయ్‌ గ్రామాలు వ్యవసాయ ప్రాంతం కావడంతో పాటు ఆహ్లాద వాతావరణం పంచుతుంది. దీంతో కొందరు రియల్టర్లు, బడాబాబులతో కలిసి వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నాలా కన్వర్షన్‌ లేకుండానే ఇష్టానుసారంగా వెంచర్ల నిర్మాణం చేపడుతున్నారు. పంచాయతీ, హెచ్‌ఎండీఏ నుంచి కూడా ఎలాంటి అనుమతులు పొందడం లేదు. అధికారుల అండదండలతోనే వెంచర్లు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి, గ్రామపంచాయతీలకు రావలసిన ఆదాయాన్ని రియల్టర్లు గండి కొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుమ్మడిదల, రామ్‌రెడ్డిబాయ్‌, అన్నారం, దోమడుగు గ్రామాలలోని వివిధ సర్వే నంబర్లలో గోప్యంగా వెంచర్‌ నిర్మాణం చేపట్టి చుట్టూ ప్రహరీని నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమిస్తే చర్యలు తప్పవు

మనోహరాబాద్‌ మండలంలో ఎక్కడా ఎఫ్‌టీఎల్‌ భూముల్లో, కుంటలు, చెరువుల స్థలాల్లో వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు లేకుండా చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌ పరిధిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తాం.

- శ్రీకాంత్‌, ఇరిగేషన్‌ డీఈ, తూప్రాన్‌

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి

మనోహరాబాద్‌ మండల కేంద్రంలో రాజకీయ పార్టీ నాయకుల అండదండలతో చెరువులు, కుంటల స్థలాలను కబ్జా చేసి వెంచర్లు నిర్మిస్తున్నారు. మండలంలో కుంటలు, చెరువులను, కాలువలను అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోని కాపాడాలని కోరుతున్నాం.

- నిమ్మల మల్లేష్‌ యాదవ్‌, మనోహరాబాద్‌

వాగుపై వంతెన నిర్మిస్తున్నా పట్టింపులేదు

మునిదేవునిపల్లి వెంచర్‌ కోసం అసైన్డ్‌ భూమి నుంచి రోడ్డు వేసి వాడుకుంటున్నారు. వాగును దాటేందుకు పైపులను వేసి వంతెనును నిర్మిస్తున్నారు. వెంచర్‌లో రోడ్లు వేసేందుకు అసైన్డ్‌ భూమి నుంచి మట్టిని తరలించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇదే పని ఓ రైతు చేస్తే అధికారులు ఆగమేఘాల మీద వస్తారు. పేదోడికి ఓ న్యాయం.. పెద్దోళ్లకు ఒక న్యాయమా? తక్షణమే చర్యలు తీసుకోకుంటే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

- నర్సింహ్మరెడ్డి, రైతు, మన్‌సాన్‌పల్లి

అక్రమ వెంచర్లను ఉపేక్షించేది లేదు

గుమ్మడిదల మండలంలో అక్రమ వెంచర్ల నిర్మాణంపై ఉపేక్షించేది లేదు. ఇప్పటివరకు మండలంలో వెలసిన, మా దృష్టికి వచ్చిన అక్రమ వెంచర్లకు నోటీసులు ఇచ్చాం. కొన్నింటిని కూల్చివేశాం. ఇంకా ఎక్కడైనా అక్రమ వెంచర్లు నిర్మాణం జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- దయాకర్‌రావు, ఎంపీవో, గుమ్మడిదల

Updated Date - May 26 , 2024 | 11:19 PM