Share News

హైరానా!

ABN , Publish Date - May 29 , 2024 | 11:42 PM

జీవాలపై హైనా పంజా

హైరానా!
మెట్టుపల్లిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోను

ట్రాప్‌ కెమెరా, బోను ఏర్పాటు చేసిన చిక్కడం లేదు

వరుస దాడులతో బెంబేలెత్తుతున్న రైతులు

చిన్నకోడూరు, మే 29 : హైనాలు హైరానా సృష్టిస్తున్నాయి. రాత్రి వేళ జీవాలపై దాడి చేస్తూ పొట్టన పెట్టుకుంటున్నాయి. గొర్రెలు, మేకల మందలపై, పొలాల వద్ద కట్టేసిన ఆవులు, దూడలు, గేదెలపై ఎగబడి నష్టాన్ని మిగిలుస్తున్నాయి. చిన్నకోడూరు మండలంలో వ్యవసాయ బావుల వద్ద పశువులకు, గొర్రెల మందలకు రక్షణ కరువైంది. వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

66 జీవాల మృతి

చిన్నకోడూరు మండలంలో వారం రోజుల్లో హైనా దాడిలో 66 జీవాలు మృతిచెందగా, మరో 23 జీవాలకు గాయాలయ్యాయి. 23న తెల్లవారు జామున మండలంలోని మాచాపూర్‌లో వ్యవసాయ బావి వద్ద ఉన్న మేకలు, గొర్రెల మందపై హైనా దాడి చేయగా, 65 జీవాలు మృతిచెందాయి. 20 జీవాలకు తీవ్ర గాయాలయ్యాయి. 24న అదే గ్రామంలో హైనా ఓ దూడను పొట్టనపెట్టుకున్నది. మరో దూడకు గాయాలయ్యాయి. 26న తెల్లవారు జామున మెట్టుపల్లిలో వ్యవసాయ బావి వద్ద ఉన్న ఓ గేదె, దూడపై హైనా దాడి చేయడంతో పశువులు బెదరాయి. అరుపులు విన్న వ్యవసాయ బావులకు సమీపంలోని సలేంద్రి గ్రామానికి చెందిన రైతులు అక్కడకు చేరుకుని శబ్ధాలు చేస్తూ బెదిరించడంతో హైనా అక్కడి నుంచి పారిపోయింది.

పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా..

పాదముద్రల ఆధారంగా జీవాలు, పశువులపై దాడికి తెగబడుతున్నది హైనా అని ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. దానిని పట్టుకోవడానికి మాచాపూర్‌లో జీవాల మందపై హైనా దాడి చేసిన ప్రదేశంలో బోను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాప్‌ కెమెరాను అమర్చారు. అయినా, బోనుకు చిక్కకపోగా ట్రాప్‌ కెమెరాలోనూ ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. ఆదివారం తెల్లవారుజామున మెట్టుపల్లిలో హైనా ఓ గేదె, దూడపై దాడి చేయడంతో అధికారులు అక్కడ కూడా బోను, ట్రాప్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. హైనా ఒకసారి వచ్చిన ప్రదేశానికి మళ్లీ రాకపోవడంతో ఫారెస్ట్‌ అధికారులకు దానిని పట్టుకోవడం సవాల్‌గా మారింది.

దరఖాస్తు చేసుకుంటే పరిహారం

హైనా దాడుల్లో మృతిచెందిన జీవాలు, పశువులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. బాధిత రైతు ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌, పశువైధ్యాధికారి జారీ చేసిన డెత్‌ సర్టిఫికెట్‌ను జత చేసి అటవీ అధికారులకు దరఖాస్తు చేస్తే వాటి ఆధారంగా ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

పాదముద్రల ఆధారంగా జీవాలు, పశువులపై దాడి చేసింది హైనాగా గుర్తించాం. హైనాను పట్టుకునేందుకు దాడులు జరిగిన ప్రదేశాల్లో బోన్‌ను, ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ట్రాప్‌ కెమెరాల్లో ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. సలేంద్రి ఫారె్‌స్టలోని నీటి కుంట వద్ద కూడ ట్రాప్‌ కెమెరాను ఏర్పాటు చేశాం. రైతులు భయాందోళనకు గురికావద్దు అప్రమత్తంగా ఉండాలి.

- బుచ్చయ్య, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌!

Updated Date - May 29 , 2024 | 11:42 PM