Share News

54 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:48 PM

నాలుగు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 54 టన్నుల రేషన్‌ బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి తెలిపారు.

 54 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

అల్లాదుర్గం, ఏప్రిల్‌ 16 : నాలుగు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 54 టన్నుల రేషన్‌ బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ బాలస్వామి తెలిపారు. మంగళవారం అల్లాదుర్గం పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లోని ఓ రైస్‌మిల్లుకు వివిధ ప్రాంతాల నుంచి నాలుగు వాహనాల్లో 54 టన్నుల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా మంగళవారం ఉదయం గడిపెద్దాపూర్‌ రైస్‌మిల్లు సమీపంలో టాస్క్‌ ఫోర్సు పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన రేషన్‌ విలువ రూ. 10.80 లక్షలు ఉంటుందన్నారు. డీఎ్‌సవో అధికారులకు సమాచారం అందించగా డిప్యూటీ తహసీల్దార్‌ ప్రణితరెడ్డి పంచనామ నిర్వహించారన్నారు. ఈ మేరకు రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమంగా రేషన్‌ను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. సమావేశంలో మెదక్‌ డీఎస్పీ రాజేష్‌, అల్లాదుర్గం సీఐ రేణుక, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:48 PM