Share News

‘గ్యారంటీ’ దరఖాస్తులే లెక్కలోకి!

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:22 PM

ఆరు గ్యారంటీ పథకాలు రేషన్‌కార్డు ఉన్నవారికేనా? అంటే అవుననే తెలుస్తున్నది.

‘గ్యారంటీ’ దరఖాస్తులే లెక్కలోకి!

ప్రభుత్వం పంపిణీ చేసిన ఫారాల్లోని వివరాలే ఆన్‌లైన్‌లో నమోదు

తెల్లకాగితాలపై వచ్చిన అర్జీలకు నో ఎంట్రీ!

75 శాతం పూర్తయిన ప్రజాపాలన డాటాఎంట్రీ

రేషన్‌కార్డుల కోసం భారీగా దరఖాస్తులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జనవరి 12: ఆరు గ్యారంటీ పథకాలు రేషన్‌కార్డు ఉన్నవారికేనా? అంటే అవుననే తెలుస్తున్నది. అర్హులైనవారు రేషన్‌కార్డు లేకపోయినా తెల్లకాగితంపై అర్జీ పెట్టుకుని దరఖాస్తు చేసుకోవచ్చని నాయకులు, అధికారులు చెప్పిన మాటలు వట్టివేనని అర్థమవుతున్నది. ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ప్రభుత్వం అందజేసిన దరఖాస్తు ఫారాల్లోని సమాచారాన్ని మాత్రమే ఆన్‌లైన్‌లో ఎంటీ చేస్తున్నారు. తెల్లకాగితంపై రాసిచ్చిన అర్జీలను పక్కనపెడుతున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డు ఉన్నవారికి మాత్రమే దరఖాస్తులు అందజేసిన అధికార యంత్రాంగం ఫారాల్లోని వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నది.

అనూహ్య స్పందన

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు మెదక్‌ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఐదు గ్యారంటీ పథకాలకు డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రేషన్‌ కార్డులతో పాటు ఏ ఇతర సమస్యలు ఉన్నా తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే ప్రక్రియకు 7 నుంచి శ్రీకారం చుట్టింది.

2.73 లక్షల దరఖాస్తులు

ప్రజాపాలన సభల ద్వారా జిల్లాలో 2,73,489 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్యారంటీలకు సంబంధించి 2,23,357 కాగా మిగిలినవి ఇతర పథకాల కోసం వచ్చాయి. ఇప్పటికే 75 శాతం దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేశారు. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మున్సిపల్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో, జిల్లా గ్రామీణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థతో పాటు ప్రైవేటుగా పనిచేస్తున్న మొత్తం 480 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లకు గ్యారంటీల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే భాద్యతలను అప్పగించారు. ఒక్కో ఆపరేటర్‌ 500 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈక్రమంలో తెల్లకాగితంపై రాసిచ్చిన అర్జీలను మాత్రం పక్కన పెడుతున్నారు.

రేషన్‌కార్డు కోసమే ఎక్కువ..

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలపై వేలాది మంది తెల్లకాగితంపై దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో రేషన్‌కార్డు కోసం వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయి. గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్‌కార్డును తప్పనిసరిచేశారు. దీంతో చాలామంది రేషన్‌కార్డు కోసం తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఆధార్‌, రేషన్‌కార్డుల నంబర్లు నింపాలని అడిగారు. అంతేకాకుండా రేషన్‌కార్డు, లబ్ధిదారుల జిరాక్స్‌ ప్రతులను జతచేయాలని సూచించారు. అలా జతచేసిన దరఖాస్తులను మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు. వివిధ సమస్యలపై తెల్లకాగితంపై రాసి ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడించారు.

Updated Date - Jan 12 , 2024 | 11:22 PM