Share News

పట్టా సర్వే నంబర్లు వేసి ప్రభుత్వ భూమి కబ్జా

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:29 AM

ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి ఇళ్లు కట్టి అమ్మేసుకున్నారు. పదేళ్ల క్రితం జరిగిన ఈ కబ్జా పర్వంపై అధికారులు చర్యలకు ఉపక్రమించడంతో ఆ ఇళ్లను కొనుగోలు చేసి వారు లబోదిబోమంటున్నారు.

పట్టా సర్వే నంబర్లు వేసి ప్రభుత్వ భూమి కబ్జా

అమీన్‌పూర్‌ సర్వే నంబర్‌ 343లో ప్రభుత్వ భూమి మాయం

లేఅవుట్‌లో ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్న తరువాత వెలుగులోకి..

నోటీసులు రావడంతో లబోదిబోమంటున్న బాధితులు

మోహం చాటేస్తున్న రియల్టర్లు

న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న బాధితులు

పటాన్‌చెరు, ఏప్రిల్‌ 5 : ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి ఇళ్లు కట్టి అమ్మేసుకున్నారు. పదేళ్ల క్రితం జరిగిన ఈ కబ్జా పర్వంపై అధికారులు చర్యలకు ఉపక్రమించడంతో ఆ ఇళ్లను కొనుగోలు చేసి వారు లబోదిబోమంటున్నారు. పట్టా భూమికి చెందిన సర్వే నంబర్లు వేసి పక్కనే ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన ఉదంతం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము ప్రాంతంలో కృష్ణ బృందావన్‌ కాలనీ పేరిట ఏడేళ్ల క్రితం వేసిన లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ భూమి ఉన్న 343 సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న 345, 346, 347, 348, 349, 350, 351, 357, 358, 359, 360 తదితర సర్వే నంబర్లలో 12 ఎకరాల విస్తీర్ణంలో అప్పట్లో రియల్టర్లు లేఅవుట్‌ చేశారు. ఇందుకు హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ లేఅవుట్‌లో పక్కనే ఉన్న 343 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలోని జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో నాలుగు నుంచి ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి లేఅవుట్‌లో కలుపుకున్నారు. ఈ భూమికి తమ పట్టా నంబర్లు వేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలకు విరుద్ధంగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, మధ్య తరగతి వేతన జీవులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇళ్లను కొనుగోలు చేశారు. మున్సిపాలిటీ అనుమతులను చూసి బ్యాంకులూ కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశాయి.

గత అక్రమాలపై నజర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జిల్లా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశాల మేరకు కలెక్టర్‌ నేరుగా రంగంలోకి దిగి సదరు లేఅవుట్‌ను సర్వే చేశారు. పెద్దఎత్తున ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. సుమారు వంద ఇళ్లకు పైగా ప్రభుత్వ సర్వే నంబర్‌ 343లోకి వస్తున్నాయని తేలింది. అయితే, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమాయకులకు అంటగట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పత్తా లేకుండా పోయారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేత ఒకరు ఇప్పుడు తనకేమీ తెలియనట్టు నటిస్తున్నారు. అమాయకులు మాత్రం తాము తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

100 ఇళ్ల కూల్చివేతకు నోటీసులు జారీ

కృష్ణ బృందావన్‌ కాలనీలో సుమారు 100 ఇళ్లు ప్రభుత్వ సర్వే నంబర్‌ 343 పరిధిలోకి వస్తాయని తేలడంతో రెవెన్యూ యంత్రాంగం కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ స్థలంలో ఉన్న ఇళ్లు, స్థలాలను మార్కింగ్‌ చేశారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా గుర్తించిన ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్‌ అనుమతులు చూసి రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ ద్వారా ఇళ్లను కొనుగోలు చేశామని, నిజంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లను నిర్మిస్తే అనుమతులు ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆదేశాలు

ఈ వ్యవహారంపై సంగారెడ్డి ఆర్డీవో సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఆక్రమణలు జరిగినట్టు నిర్దారించి లేఅవుట్‌ తయారుచేసిన బిల్డర్లపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 343 సర్వే నంబర్‌లో నిర్మించిన ఇళ్లు, ప్లాట్లను గుర్తించి ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా సంగారెడ్డి రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ లేఅవుట్‌లో ఇళ్లు కొనుగోలు చేసి నష్టపోయిన బాధితులు సొసైటీగా ఏర్పడి న్యాయం కోసం అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బాధితులు పేర్కొంటున్నారు. లేఅవుట్‌ చేసి ఇళ్లు నిర్మించిన ఇన్నేళ్ల అనంతరం ప్రభుత్వ భూమి అంటూ వేధించడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణకు గురైందని చెబుతున్న 343 సర్వేనంబర్‌ మొత్తాన్ని మరోసారి సర్వే చేసి చెరువులు, కుంటలు, గుట్టలు, ఎస్‌పీఎఫ్‌ అకాడమీకి ఇచ్చిన భూములు, అసైన్డ్‌ భూముల లేక్కలు తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమగ్రంగా సర్వే చేస్తే కొందరికైనా న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు, ప్లాట్లు నిర్మించి అమాయకులకు అంటగట్టిన రియల్టర్లు, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:29 AM