Share News

గం‘జాయ్‌..’

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:08 AM

పిల్లలు మారాం చేశారనో.. లేదంటే నోటికి ఏదైనా తీపిగా తినాలనిపిస్తుందనో.. చాక్లెట్లు కొనే ముందు తస్మాత్‌ జాగ్రత్త.. ఎందుకంటే తియ్యటి చాక్లెట్లలో మత్తుగా గంజాయి కలిపి విక్రయిస్తున్న వైనం బుధవారం చేర్యాలలో వెలుగుచూసింది.

గం‘జాయ్‌..’
కోహెడ మండలం చంద్రనాయక్‌ తండాలో తొలగించిన గంజాయి మొక్కలు(ఫైల్‌)

జిల్లాలో డ్రగ్స్‌ కల్చర్‌ జాడలు

కిక్కెక్కిస్తున్న చాక్లెట్లు, సిగరెట్లు

వెలుగుచూస్తున్న గంజాయి విక్రయాలు

చేర్యాల ఘటనతో నివ్వెరబోయిన వైనం

గతంలోనూ పలుచోట్ల గంజాయి ఆనవాళ్లు

ఇటీవలే తీవ్రంగా హెచ్చరించిన సీపీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 1 : పిల్లలు మారాం చేశారనో.. లేదంటే నోటికి ఏదైనా తీపిగా తినాలనిపిస్తుందనో.. చాక్లెట్లు కొనే ముందు తస్మాత్‌ జాగ్రత్త.. ఎందుకంటే తియ్యటి చాక్లెట్లలో మత్తుగా గంజాయి కలిపి విక్రయిస్తున్న వైనం బుధవారం చేర్యాలలో వెలుగుచూసింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంతకాలం సిగరెట్ల వరకే పరిమితమైన గంజాయి మత్తును చాక్లెట్లలోకి సర్దుబాటు చేసే తతంగాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డ్రగ్స్‌, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని కొత్త సీపీ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే ఈ వ్యవహారం బయటపడింది. మరింత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున సిద్దిపేట జిల్లాల కొంత పాశ్చాత్య సంస్కృతి అలవడుతున్నది. హైదరాబాద్‌లో తరుచుగా డ్రగ్స్‌, గంజాయి ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది యువత ఈ డ్రగ్స్‌, గంజాయి కల్చర్‌కు బానిసలుగా మారుతున్నారు. ఇదే సంస్కృతి జిల్లాను సైతం తాకింది. ఇటీవల కాలంలో పలు సంఘటనలు వెలుగులోకి రావడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

ఆ అడ్డాల్లోనే ఆనవాళ్లు

తాజాగా చేర్యాలలోని పాన్‌షాపు కేంద్రంగా గంజాయి చాక్లెట్లు విక్రయించడం వెలుగులోకి వచ్చింది. ఇదే విధంగా జిల్లాలోని పలు పాన్‌షాపుల్లో ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఇక యువతను టార్గెట్‌ చేస్తూ కాలేజీల సమీపంలో ఏర్పాటైన పాన్‌షాపులు, బేకరీలు, టీ దుకాణాల్లోనూ మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. గంజాయి, డ్రగ్స్‌తో పాటు వైట్‌నర్‌, కొన్ని మత్తెక్కించే మెడిసిన్‌ను సైతం విచ్చలవిడిగా వినియోగిస్తునట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలు, యువకులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వందల రూపాయలు వెచ్చించి మద్యం కొనుగోలు చేయడం కంటే పదుల రూపాయల్లోనే లభ్యమయ్యే గంజాయి సిగరెట్లకు మొగ్గు చూపిస్తున్నారు.

నిఘా పెంచితేనే

గంజాయి, డ్రగ్స్‌ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ దిశగా నిఘాను పెంచాల్సిన అవసరం ఉన్నది. జిల్లాలో ప్రధానంగా డ్రగ్స్‌, గంజాయిని ప్రబలకుండా చూస్తానని తాజాగా పోలీస్‌ కమిషనర్‌ అనురాధ స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఆమె ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చెప్పకనే చెప్పారు. ఇంతలోనే పలు సంఘటనలు వెలుగులోకి రావడం పోలీస్‌ శాఖకు సవాల్‌ విసిరినంత పనైంది. అయితే పట్టుబడిన నేరస్థుల వాంగ్మూలాల ఆధారంగా క్షేత్రస్థాయిలో నిఘాను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర రాష్ర్టాల కూలీలతోపాటు పలు విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాలపైనా నిఘా అవశ్యంగా కనిపిస్తున్నది.

గుప్పుమంటున్న గంజాయి

కోహెడ మండలం ఆరెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రనాయక్‌ తండాలో గల ఓ ఇంటి ఆవరణలో 26 గంజాయి మొక్కలతోపాటు 240 గ్రామా లు ఎండు గంజాయి లభ్యమైంది. ఎక్సైజ్‌ అధికారులు గణేశ్‌ అనే వ్యక్తిపై కేసు సైతం నమోదు చేశారు.

బెజ్జంకి మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై 2022లో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా కూడా ఇదే మండలానికి చెందినవారు.

గత సెప్టెంబరు 12వ తేదీన గజ్వేల్‌ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని 21 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చేర్యాల మండలం చుంచనకోట గ్రామశివారులో 1590 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు.

సిద్దిపేటలోని నాసర్‌పుర పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తుండగా వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేటఅర్బన్‌ మండలం పొన్నాలలో వ్యవసాయ బావి వద్ద గంజాయి మొక్కలు పెంచుతున్నాడని గతంలో ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.

గతంలో మద్దూరు మండలం ధర్మారంలో ఓ యువకుడు గంజాయి విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 02 , 2024 | 12:08 AM