Share News

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో గడబిడ..!

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:08 AM

నియోజకవర్గంలో నామినేటెడ్‌ పదవుల చిచ్చు

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో గడబిడ..!

గ్రూపులుగా విడిపోయిన నాయకులు

మంత్రులను కలుస్తూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు

గజ్వేల్‌, జూన్‌ 22: గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నామినెటెడ్‌ పదవులు చిచ్చురేపాయి. అంతా కలసిమెలసి ఉన్న నాయకులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు గ్రూపులుగా విడివడి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు.

అసమ్మతి రాగం

‘నిన్న.. మొన్నటి వరకు నర్సారెడ్డి అంటే మేము... మేము అంటే నర్సారెడ్డి’ అన్నట్లుగా ఉన్న నాయకులు పదవి దక్కదని తెలిసి ఒక్కసారిగా అసమ్మతి రాగాన్ని అందుకున్నారు. నర్సారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్ల కోసం కొందరి పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో అనుచరులుగా ఉన్న తమను కాదని ఇతరులకు పదవిని కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని వారు టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రావు చెంతకు చేరారు. నర్సారెడ్డిపై అసమ్మతితో ఉన్న పలువురు నాయకులకు తోడు నర్సారెడ్డి వెంట ఉన్న నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి, మోహన్నగారి రాజు, గోపాల్‌రావు లాంటి వారు జత కలిశారు. వీరంతా కలసి ఇటీవలే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. నర్సారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదనను వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.

అంతే దీటుగా నర్సారెడ్డి

అసమ్మతి నాయకులు ప్రత్యేక కుంపటి పెట్టడంతో డీసీసీ అధ్యక్షుడిగా, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నర్సారెడ్డి దీటుగా స్పందిస్తున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్‌రావు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌లను కలసి నామినేటెడ్‌ పదవులకు సంబంధించిన వివరాలను అందజేశారు. అంతేకాకుండా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మొత్తంగా నియోజకవర్గంలో నామినెటెడ్‌ పదవుల పందేరం అధికార కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపింది. ఇది ఎంత వరకు వెళ్తుందోనని కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ

గజ్వేల్‌, జూన్‌ 22 : గజ్వేల్‌ నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదని దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం రాత్రి సచివాలయంలో మంత్రులను కలిశారు. పీసీసీ స్థాయి నాయకుడు గజ్వేల్‌లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడని, ఎన్నికల్లో ఆయన అనుచరులు బీజేపీ పార్టీకి పనిచేశారని ఆధారాలతో సహా నర్సారెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో గజ్వేల్‌లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఆయనే కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అని తెలిపారు. ఆయన సూచించిన వారికే పదవులు ఇస్తామన్నట్లు తెలిసింది.

Updated Date - Jun 23 , 2024 | 12:08 AM