Share News

గ్రామపంచాయతీల పాలనకు నిధుల గండం

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:19 PM

కొల్చారం, జూన్‌ 9: నిధులు లేక గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామపంచాయతీల ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. సర్పంచుల పదవీకాలం ముగినప్పటి నుంచి పల్లె పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గ్రామపంచాయతీల పాలనకు నిధుల గండం
రంగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం

పంచాయతీ కార్యదర్శులపై భారం

పట్టించుకోని ప్రత్యేకాధికారులు

కొల్చారం, జూన్‌ 9: నిధులు లేక గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న గ్రామపంచాయతీల ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. సర్పంచుల పదవీకాలం ముగినప్పటి నుంచి పల్లె పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేక అనేక పనులకు ఆటంకం ఏర్పడుతోంది. నిధులు సకాలంలో రాకపోవడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. ఫిబ్రవరి 2వ తేదీవరకు సర్పంచులు, పాలకవర్గాలకు బాఽధ్యత ఉండేది. గ్రామంలో ఏ పని కావాలన్నా సర్పంచులు ముందుగా వారి జేబులోంచి ఖర్చు చేసేవారు. తర్వాత బిల్లులు డ్రా చేసుకునేవారు. వారి పదవీకాలం ముగిసిన తర్వాత ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లలో డీజిల్‌ పోయడానికి కూడా డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. వీధిదీపాల నిర్వహణ, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు, పారిశుధ్య కార్మికులకు కొద్దిగా వేతనాలు సర్దుబాటు చేయడం, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లకు ట్యాంకులు అమర్చడం వంటి పనులను కార్యదర్శులే సొంతంగా డబ్బులు ఖర్చు చేశారు. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాఽధికారులను నియమించింది. వీరు అప్పటికే వారి పనులు, బాధ్యతతో తీరికలేకుండా ఉంటుందన్నారు. ఇలాంటి సందర్భంలో వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి రెండు, మూడు పంచాయతీల బాఽధ్యతలూ ఉన్నాయి. దీంతో వారు పంచాయతీల పాలన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకసారి కూడా గ్రామాలకు రావడం లేదు. దీంతో కార్యదర్శులే ముఖ్యమైన పనులు, సంతకాల కోసం ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్తున్నారు.

పాలకవర్గాల ఎన్నికల తర్వాతే నిధులు

పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి నిధులు విడుదలవుతాయి. జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా గ్రామాలకు విడుదల చేస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాదికి నాలుగుమార్లు పంచాయతీలకు అందజేస్తున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రెండేళ్లుగా రావడం లేదు. నిధులు సక్రమంగా సకాలంలో రాకపోవడంతో అప్పటి పంచాయతీ పాలకవర్గాలే సొంతంగా జేబు నుంచి ఖర్చు చేశారు. కొందరు సర్పంచులు అప్పులు కూడా చేశారు. పదవీకాలం మరో ఆరునెలల్లో ముగుస్తుందన్న సమయం నుంచి సర్పంచులు కూడా డబ్బులు ఖర్చు చేయలేదు. అప్పటికే వారు ముందు ఖర్చుచేసిన డబ్బులు రావాల్సి ఉంది. ఒక్కో గ్రామపంచాయతీలో చేపట్టిన పనులకు తాజా మాజీ సర్పంచులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రావాల్సి ఉన్నది. చేపట్టిన పనులకు తోడు ఎంబీ రికార్డులు చేసి నిధుల విడుదల కోసం ఎదురు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో రావని, మళ్లీ పంచాయతీల పాలకవర్గాలను ఎన్నుకొన్న తర్వాతే వస్తాయని పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల తిప్పలు

గ్రామపంచాయతీల్లో నిధుల్లేక చాలాచోట్ల సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా పారిశుధ్య కార్మికులు తిప్పలు పడుతున్నారు. గ్రామపంచాయతీల్లో ప్రతి 500 మంది జనాభాకు ఒక మల్టీపర్పస్‌ వర్కర్‌ను నియమించారు. వీరు విద్యుత్‌ లైట్లు, పారిశుధ్యం, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్‌ నడిపించడం, మంచినీటి సరఫరా వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వీరికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.

రూ.30 లక్షల బిల్లులు రావాల్సి ఉంది

ఐదేళ్లకాలంలో ఏటిగడ్డమాందాపూర్‌ గ్రామంలో ఎన్నో పనులు చేశాం. పల్లె ప్రగతి, డంపింగ్‌యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతివనాల ఏర్పాటు, క్రీడా ప్రాంగణం, అంతర్గత సీసీరోడ్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ పనులు చేశాం. ఇప్పటికే రూ.30 లక్షల బిల్లులు రావాల్సి ఉంది.

- విష్ణువర్ధన్‌రెడ్డి, ఏటిగడ్డమాందాపూర్‌ తాజా మాజీ సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు

Updated Date - Jun 09 , 2024 | 10:19 PM