Share News

ఆధునిక పరిజ్ఞానంతో పండ్లను సాగు చేయాలి

ABN , Publish Date - May 21 , 2024 | 11:17 PM

సంగారెడ్డి రూరల్‌, మే 21: రైతులు ఆధునిక పరిజ్ఞానంతో మామిడి పండ్లను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డి.నీరజాప్రభాకర్‌ అన్నారు.

ఆధునిక పరిజ్ఞానంతో పండ్లను సాగు చేయాలి
సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రంలో ప్రదర్శనలో ఉంచిన మామిడి పండ్లను పరిశీలిస్తున్న కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ నీరజాప్రభాకర్‌

కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డి.నీరజాప్రభాకర్‌

ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో 265 రకాల మామిడి పండ్లు

సంగారెడ్డి రూరల్‌, మే 21: రైతులు ఆధునిక పరిజ్ఞానంతో మామిడి పండ్లను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డి.నీరజాప్రభాకర్‌ అన్నారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రంలో మంగళవారం మామిడిపండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సంగారెడ్డిలో గల ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో 265 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మామిడిపండ్లను సాగుచేసే సమయంలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులతో సాగుచేస్తే నాణ్యమైన పండ్లు వస్తాయని, పండ్ల కోతల సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మామిడి పండ్లన ఎండబెట్టి ఆమ్‌చూర్‌ని ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో 1994 నుంచి 1999 వరకు తయారు చేశారని గుర్తుచేశారు. కాలం మారిన కొద్దీ వివిధరకాలుగా రుచికరంగా ఆమ్‌చూర్‌ని తయారు చేస్తున్నారన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అనేక రకాల మామిడిపండ్లను సాగుచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. రైతులు మామిడిపండ్లను సాగుచేసేందుకు ముందుకు రావాలని నీరజాప్రభాకర్‌ కోరారు. ఇదిలా ఉండగా ఎఫ్‌ఆర్‌ఎ్‌సలో నిర్వహించిన మామిడిపండ్ల ప్రదర్శనలో అధికారులు, సిబ్బంది తప్ప ఎవరినీ ఆహ్వానించలేదని, సమాచారం లేక ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే హాజరయ్యారు. ఎప్‌ఆర్‌ఎస్‌ అధికారులు రైతు సంఘాల నాయకులు, ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే ప్రదర్శనను ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి.

ప్రదర్శనలో కుళ్లిన మామిడిపండ్లు

సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన మామిడి పండ్ల ప్రదర్శనలో కుళ్లిన పండ్లు దర్శనమిచ్చాయి. ప్రదర్శనకు వచ్చిన వారు కుళ్లిన పండ్లను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని అక్కడే ఉన్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ అధికారులను అడగగా పొరపాటున వచ్చాయని వాటిని ప్రదర్శనలో నుంచి తీసివేశారు. ఈ కార్యక్రమంలో ఫల పరిశోధన శాస్త్రవేత్తలు డా.కిరణ్‌కుమార్‌, డా.హరికాంత్‌, డా. మాధవి, డా.మౌనిక, డి.నితీష్‌, ఉద్యానవన శాఖ అధికారి సమత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:17 PM