Share News

ధాన్యం కొనుగోలుకు కసరత్తు

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:16 PM

యాసంగిలో 3.38 లక్షల ఎకరాల్లో వరి సాగు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా ఊరూరా కొనుగోలు కేంద్రాలు నెల రోజుల్లో చేతికి రానున్న వరి పంట

ధాన్యం కొనుగోలుకు కసరత్తు
చిరు పొట్ట దశలో ఉన్న వరి చేను

సిద్దిపేట అగ్రికల్చర్‌, మార్చి 17: ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో సుమారు 3.38లక్షల ఎకరాలకు పైగా వరి సాగయిందని, దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగానే ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నెలరోజుల్లో పంట చేతికివచ్చే అవకాశముండడంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా అధికార యంత్రం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందని, ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.

కొనుగోలు కేంద్రాలకు 3.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

జిల్లాలో యాసంగి ప్రారంభంలో భూగర్భ జాలాలు సమృద్ధిగా ఉండడం, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు ఉండడంతో విస్తారంగా వరినాట్లు వేశారు. మొదట్లో మొగిపురుగు, తెగుళ్ల బెడద వరి పంటను వెంటాడింది. ప్రస్తుతం మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో సాగైన 3.38 లక్షల ఎకరాల వరి పంట నుంచి సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే రైతు అవసరాలు, సీడ్‌ ప్రొడక్షన్‌ ద్వారా సాగుచేసిన వాటిని తీసేయగా.. దాదాపు 3.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

414కు పైగా కొనుగోలు కేంద్రాలు

గతంలో మాదిరిగానే జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో 414కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఇందులో పీఏసీఎ్‌సల ఆధ్వర్యంలో 188, ఐకేపీల ఆధ్వర్యంలో 221, మెప్మా ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అవసరం ఉంటే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం నిర్ణయించిన ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.2,203, బీ-గ్రేడ్‌కు రూ.2,183 చొప్పున కొనుగోలు చేయనున్నారు. 85లక్షలకు పైగానే గన్నీ బ్యాగులు అవసరమని నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 65 లక్షలకు పైగానే గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Mar 17 , 2024 | 11:16 PM