Share News

ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:00 PM

పటాన్‌చెరు, మార్చి 4 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంగారెడ్డి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. పటాన్‌చెరు శివారులోని పటేల్‌గూడ ఎల్లంకి ఇంజనీరింగ్‌ కళాశాల పక్కన సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం
పటేల్‌గూడ వద్ద సభా ప్రాంగణంలో జనం కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ

నేడు సంగారెడ్డి జిల్లాకు మోదీ రాక

పటేల్‌గూడలో ఏర్పాట్లు పూర్తి

సభా స్థలి వద్దే హెలీప్యాడ్‌

కట్టుదిట్టమైన భద్రత

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

పటాన్‌చెరు, మార్చి 4 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంగారెడ్డి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. పటాన్‌చెరు శివారులోని పటేల్‌గూడ ఎల్లంకి ఇంజనీరింగ్‌ కళాశాల పక్కన సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొనున్నారు. ప్రధాని, సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్‌పీఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్‌ అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా స్థలిలో సుమారు లక్ష మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలోనే రెండు హెలీప్యాడ్‌లను నిర్మించారు. అత్యవసరంగా పటాన్‌చెరు శివారులోని ఇక్రీశాట్‌లో మరో హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. సోమవారం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ హెలీకాఫర్‌లు, ప్రధాని కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని

మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా సభా స్థలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగనున్నారు. తొలుత పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వర్చువల్‌గా పలు ప్రగతి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరిగివెళ్లిపోతారు. తర్వాత నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. బహిరంగ సభకు మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి నుంచి సుమారు లక్ష మంది జనసమీకరణ చేసేందుకు బీజేపీ నాయకత్వం కార్యాచరణ రూపొందించారు.

రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మొత్తం రూ.9,021కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేస్తారు. పూణే - హైదరాబాద్‌ రహదారిలో సంగారెడ్డి క్రాస్‌ రోడ్డు మీదుగా మదీనగూడ వరకు రూ.1,298 కోట్లతో ఆరులేన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.399 కోట్లతో మెదక్‌ ఎల్లారెడ్డి రెండో లైన్‌ హైవే విస్తరణ పనులకు, రూ.500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్‌ హైవే పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.3,338 కోట్లతో ఏర్పాటు చేసిన పారాదీప్‌ హైదరాబాద్‌ గ్యాస్‌ పైపులైన్‌ను జాతికి అంకితం చేస్తారు. రూ.400 కోట్లతో నిర్మించిన సివిల్‌ ఏవియేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. రూ.1,409 కోట్లతో నిర్మించిన కంది రాంసాన్‌పల్లి నాలుగు లేన్ల జాతీయ రహదారిని ప్రారంభిస్తారు. రూ.323 కోట్లతో నిర్మించిన మిర్యాలగూడ, కోదాడ రెండో లైన్‌ జాతీయ రహదారిని, రూ.1165 కోట్లతో నిర్మించిన హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ పరిసరాలలో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులను ప్రారంభిస్తారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

మంగళవారం ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ప్రధాని సభకు పలు నియోజకవర్గాల నుంచి హాజరయ్యే వారికి సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పటాన్‌చెరు శివారులోని ఎల్లంకి ఇంజనీరింగ్‌ కళాశాల పక్క ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకునేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించారు. కామారెడ్డి, రామాయంపేట, తూప్రాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు శామీర్‌పేట వద్ద, మెదక్‌, నర్సాపూర్‌ నుంచి మీటింగ్‌కు వచ్చే బస్సులు గుండ్లపోచంపల్లి వద్ద, సంగారెడ్డి, జహీరాబాద్‌, జోగిపేట నుంచి వచ్చే బస్సులు ముత్తంగి ఔటర్‌రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ మూడు వద్ద, హత్నూర, దౌల్తాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు సుల్తాన్‌పూర్‌ ఎగ్జిట్‌ వద్ద దిగి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడా, ఎల్లంకి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను నిలిపి సభావేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లాలని సూచించారు. కార్లలో వచ్చే వారికి ప్రత్యేకించి రామేశ్వరంబండలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలంలో నిలుపుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను బీరంగూడా కమాన్‌ నుంచి లోనికి అనుమతించరు. పటాన్‌చెరు శివారులోని జీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి పటేల్‌గూడా కిష్టారెడ్డిపేట రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధించారు.

డ్రోన్‌లపై నిషేధం : కలెక్టర్‌

సంగారెడ్డి రూరల్‌, మార్చి 4 : పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 5వ తేదిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున జిల్లా వ్యాప్తంగా డ్రోన్‌ల ఎగరవేతను నిషేధించినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా, ఇక్రిశాట్‌ పరిసర ప్రాంతాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల మేర రెడ్‌ అలర్ట్‌ విధిస్తున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:00 PM