Share News

మళ్లీ విద్యా వలంటీర్లు!

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:12 AM

ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో సర్కారు బడుల్లో విద్యావలంటీర్లను నియమించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.

మళ్లీ విద్యా వలంటీర్లు!

వీవీల నియామకానికి ప్రభుత్వం సుముఖత

ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యంతో నిర్ణయం

సంగారెడ్డి జల్లావ్యాప్తంగా పాఠశాలల్లో 868 ఖాళీలు

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 16 : ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో సర్కారు బడుల్లో విద్యావలంటీర్లను నియమించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధుల్లో చేరేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నది. బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని ఇప్పటికే సర్కారు సూచించడంతో విద్యా శాఖ అఽధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏయే పాఠశాలలో వలంటీర్ల అవసరం ఉందనే వివరాలు సేకరిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో 868 ఖాళీలు

సంగారెడ్డి జిల్లాలో 1,247 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 5,947 టీచర్‌ పోస్టులు మంజూరయి ఉన్నాయి. ప్రస్తుతం 5,079 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌(ఎ్‌సఏ) టీచర్‌ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నది. ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనకు ఆటంకం కలుగుతున్నది. పలుచోట్ల ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పదో తరగతి ఫలితాలపైనా ఈ ప్రభావం పడుతున్నది. సిబ్బంది కొరతతో విద్యాశాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడడంతో ఈ ఏడాది 150 మంది టీచర్లను డిప్యూటేషన్‌పై ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేశారు. జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూల్స్‌ 47 ఉన్నాయి. వీటిలో పనిచేసే ఉపాధ్యాయులను కూడా సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించారు.

మూడేళ్ల అనంతరం మరోసారి..

ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల్ల అనంతరం మరోసారి విద్యావలంటీర్ల నియామకం తెరపైకి వచ్చింది. 2019-20 విద్యాసంవత్సరంలో జిల్లాలో 1,293 మంది వలంటీర్లు బోధన కొనసాగించారు. కరోనా కారణంగా 2020 నెలాఖరులో పాఠశాలలు మూతబడ్డాయి. 2020-21 విద్యా సంవత్సరం చివర్లో బడులు తెరిచినా విద్యా వలంటీర్లను మాత్రం విధుల్లోకి తీసుకోలేదు. ఆ తరువాత ప్రభుత్వం శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా చేపట్టలేదు. ఉన్న ఉపాధ్యాయులతోనే నెట్టుకొచ్చారు. తాజాగా ప్రభుత్వం విద్యా వలంటీర్ల నియామకానికి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసిన వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. శాశ్వత నియామకాలు జరిపే వరకు తాత్కాలికంగా వీవీలుగానైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి చెల్లించే వేతనాలు సరిపోతాయి అనేది ప్రశ్నార్థకం. గతంలో వీవీలకు ప్రభుత్వం నెలకు రూ.12 వేల గౌరవ వేతనం చెల్లించింది. ఇపుడు కనీసం రూ.20 వేల వేతనం చెల్లించకపోతే పెరిగిన ధరలకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు.

Updated Date - Jan 17 , 2024 | 12:12 AM