భూములు అన్యాక్రాంతం కావొద్దు: కలెక్టర్ క్రాంతి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:28 PM
సంగారెడ్డి రూరల్, ఫిబ్రవరి 6: సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి రూరల్, ఫిబ్రవరి 6: సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వాటి చుట్టూ రెండు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు. పాఠశాలలు కళాశాలలు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్లాంటేషన్ చేయాలని, పురపాలికల్లోని అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, ఆరు ఫీట్ల మొక్కలు నాటాలన్నారు. రాజీవ్ పార్కు అభివృద్ధికి అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్‌కు ఆదేశించారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నారు.
అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేయండి
జిల్లాలో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. అంగన్‌వాడీ పరిధిలోని (సామ్, మామ్) లోప పోషణతో ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించి సాధారణ స్థితికి వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలోని నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. వృద్ధాశ్రమానికి అవసరమైన ఫర్నిచర్, బెడ్స్ వంటి ఏర్పాట్లకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ బాలసదనానికి కూడా ప్రతిపాదనలు అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీడబ్ల్యూవో సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల ధికారులు పాల్గొన్నారు.