డాక్టర్లు రారు..సిబ్బంది ఉండరు!
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:41 PM
సంగారెడ్డి జిల్లాలోని సర్కారు దవాఖానాలపై జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నెల 4న జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, సమస్యలు వైద్య ఆరోగ్యశాఖ పనితీరుకు అందంపడుతున్నాయి.

జిల్లా ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట
పట్టించుకోని అధికారులు
అడుగడుగునా నిర్లక్ష్యం
ఇన్‌చార్జి పాలనతో పర్యవేక్షణ ఆగమాగం
కలెక్టర్, ఎమ్మెల్యేల తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
జడ్పీ సమావేశంలో మంత్రి ఆగ్రహం
సంగారెడ్డి అర్బన్, జూలై 5 : సంగారెడ్డి జిల్లాలోని సర్కారు దవాఖానాలపై జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నెల 4న జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, సమస్యలు వైద్య ఆరోగ్యశాఖ పనితీరుకు అందంపడుతున్నాయి. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖాన, బస్తీ దవాఖానాల్లో వైద్య సేవల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్, ఎమ్మెల్యేల తనిఖీల్లో లోపాలు
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని గత నెల 12న ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ క్రమంలో హాజరు రిజిస్టర్‌లో డాక్టర్లు, సిబ్బంది సంతకాలు చేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మందికి 15 మందే విధుల్లో ఉండడం పట్ల మండిపడ్డారు. అదే విధంగా గత నెల 19 న సిర్గాపూర్ పీహెచ్‌సీని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తనిఖీ చేశారు. అక్కడి రికార్డు అసిస్టెంట్ నెల పదిహేను రోజులుగా గైర్హాజరవడం, ఎల్‌టీ డిప్యూటేషన్‌లో పంపడం, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ సైతం విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల 26న కలెక్టర్ వల్లూరు క్రాంతి జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి పడకలపై బెడ్‌షీట్లు లేకపోవడం, డాక్టర్లు యాప్రాన్ ధరించకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవంటూ ఆమె హెచ్చరించారు. ఇక అదేరోజు నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తనిఖీ చేయగా.. విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సెలవు పెట్టకుండా సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు గైర్హాజరవడం, ఇద్దరు ఫార్మసిస్టులు డిప్యూటేషన్‌పై ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలో ఇద్దరు ఫార్మసిస్టులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. కానీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు ఆస్పత్రుల్లో మందుల కొరతపై జిల్లా వైద్యాధికారులను నిలదీశారు. దీంతో మంత్రి దామోదర్ అధికారుల తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డి జీజీహెచ్‌లోనూ పలువురు స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి అన్ని సర్కారు ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా కఠిన చర్యలు తీసుకుంటేనే వైద్య సేవలు సక్రమంగా అందే అవకాశాలున్నాయి.
జిల్లా కేంద్రానికే పరిమితం
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాల్సిన జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు జిల్లా కేంద్రానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ఒక వేళ తనిఖీలకు వెళ్తే అప్పటికప్పుడు హడావుడి చేసి సంబంధిత విజిట్ ఫోటోలను ఉన్నతాధికారులకు పంపి నామమాత్రంగా మమ అనిపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా వైద్యాధికారులతో పాటు ప్రోగ్రాం ఆఫీసర్లకు వాహన రవాణా భత్యం ఇచ్చి నిత్యం పర్యటించాలని ఉన్నతాధికారులు తరచూ సూచిస్తున్నా..వారు పెడచెవినపెట్టి పర్యవేక్షణ గాలికి వదిలేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయకుండా ప్రతీ నెల వాహన రవాణా భత్యాన్ని మిగిలించుకుని కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించకపోవడంతో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సైతం విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి ఇన్‌చార్జిల పెత్తనం
జిల్లాలో కొంత కాలంగా ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారులు పాలన కొనసాగుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో భాగంగా మూడున్నరేళ్లుగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో పాలన కొనసాగుతున్నది. అదే విధంగా టీవీవీపీ పరిధి కింద ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ కూడా కొన్నేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ వస్తున్నారు. వీరిరువురు దాదాపు పదేళ్లుగా ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. 2021 లో రెగ్యులర్ డీఎంహెచ్‌వోను జిల్లాకు నియమించినప్పటికీ జిల్లా యంత్రాంగం విధులు అప్పగించేందుకు విముఖత వ్యక్తం చేసింది. జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా ఆస్పత్రులను గాడిన పెట్టాల్సిన వీరి పనితీరుపై తాజాగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోతో పాటు డీసీహెచ్‌ఎస్‌పై మంత్రి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి కూడా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వారిపై చర్యలకు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసే అవకాశం లేకపోలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.