Share News

ప్రధాన రహదారి విస్తరణకు నోచుకునేనా?

ABN , Publish Date - May 24 , 2024 | 11:44 PM

రోజురోజుకూ విస్తరిస్తున్న చేర్యాల పట్టణం గతంలోనే ఇళ్లకు మార్కింగ్‌ నష్టఅంచనాకు రెండేళ్లకిత్రం సర్వే

ప్రధాన రహదారి విస్తరణకు నోచుకునేనా?
అంబేడ్కర్‌నగర్‌ కాలనీలో ఎదురెదురుగా రావడంతో దారిలో నిలిచిన ఆర్టీసీ బస్సులు

చేర్యాల, మే 24: చేర్యాల-నంగునూరు ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారితో పాటు అంతర్గత మార్గాలలో ట్రాఫిక్‌ సమస్య నెలకొంటున్నది. గతంలోనే చేర్యాల-నంగునూరు దారి విస్తరణకు నిఽధులు మంజూరయ్యాయి. కానీ స్థానిక అభయాంజనే యస్వామి ఆలయం నుంచి అంబేడ్కర్‌నగర్‌ కాలనీ మీదుగా చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు.

విస్తరణకు అడ్డుగా సంత

దూళిమిట్ట నూతన మండలం కావడంతో పాటు చేర్యాల, ఆకునూరు మీదుగా నిత్యం రాకపోకలు పెరిగి రద్దీగా మారింది. ఈ దారిగుండా స్థానిక అంగడిబజారు లో ఎన్నోయేళ్లుగా ప్రతీ మంగళవారం వారాంతపుసంత నిర్వహిస్తుండటంతో బాలాజీ కళామందిర్‌ మీదుగా బైపాస్‌ రోడ్డు చేపట్టారు. పెద్దమ్మగడ్డ నుంచి గతంలో డబుల్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం జరిగినా, అభయాంజనేయస్వామి ఆలయం నుంచి అంబేడ్కర్‌నగర్‌ వరకు పలువురి ఇళ్లు కోల్పోనుండడంతో ప్రత్యామ్నాయస్థలం, నష్టపరిహారం అందించే పరిస్థితిలేక వాయిదా వేస్తూ వచ్చారు. సుమారు మూడేళ్లక్రితం ఆకునూరు గ్రామంలో రోడ్డువిస్తరణ పనులు పూర్తిచేయడంతో చేర్యాల పనులే పెండింగ్‌ అయ్యాయి.

భిన్నాభిప్రాయాలు

అంగడిబజారు నుంచి కొనసాగిస్తే ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో బైపా్‌సరోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ కాలనీ వరకు చేపట్టాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నోఏళ్లుగా అంగడిబజారు నుంచి కొనసాగించినందున అక్కడి నుంచే చేపట్టాలని కొందరు పట్టుబడుతుండగా, మరికొందరు ఎవరికీ నష్టం కలగకుండా ఉండేందుకు బైపా్‌సరోడ్డు ఉపకరిస్తుందని చెబుతుండటం వివాదాస్పదమవుతున్నది.

మార్కింగ్‌ చేసినా..

రెండుసంవత్సరాలక్రితం మునిసిపల్‌ అధికారులు రెండు మార్గాలలో రోడ్డు విస్తరణకు 30ఫీట్ల ప్రతిపాదికన భవనాలకు మార్కింగ్‌ చేశారు. ఎన్ని ఇల్లు పూర్తిగా, పాక్షికంగా కోల్పోతున్నారు. ఎంత నష్టం జరుగుతుంది. ఏమేర పునరావాస చర్యలు చేపట్టాలన్న విషయమై సర్వే నిర్వహించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్దత వీడలేదు.

ప్రమాదకరంగా రహదారి

ఈ దారిలో రెండు వాహనాలు ఒకేసారి వచ్చినా, పాఠశాల సమయంలో బయటకు వెళ్లాలన్నా ట్రాఫిక్‌ జాం కావడంతో తంటాలుపడుతున్నారు. పలుచోట్ల రోడ్డుదెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఇరుకైన రోడ్డుపక్కనే ఇల్లు ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అలాగే బైపా్‌సరోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైనా పంచాయత్‌రాజ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎవరికీ నష్టం కలిగించకుండా పట్టణ సుందరీకరణకు దోహదపడేలా విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2024 | 11:44 PM