Share News

కోనోకార్పస్‌ చెట్లు తొలగించరూ..!?

ABN , Publish Date - Jun 27 , 2024 | 10:52 PM

పూలు, నీడనిచ్చే మొక్కలు నాటాలి చేర్యాల పట్టణ ప్రజల వేడుకోలు

కోనోకార్పస్‌ చెట్లు తొలగించరూ..!?
డివైడర్లలో మధ్యలో పెరిగిన కోనోకార్పస్‌ చెట్లు

చేర్యాల, జూన్‌ 27: పక్షులు వాలకపోగా, ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లచేసే కోనోకార్పస్‌ చెట్లు, మొక్కలను తొలగించాలని చేర్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు. హరితహారం పేరిట జనగామ-సిద్దిపేట జాతీయ ప్రధాన రహదారికి ఇరుపక్కల, డివైడర్లలో కొన్నాళ్లక్రితం కోనోకార్పస్‌ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి పచ్చదనం రూపుదిద్దుకున్నప్పటికీ మానవులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడతారని, ప్రాణాంతకరమైనవిగా ప్రచారం జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పట్టణాన్ని హరితమయంగా తీర్చిదిద్దేందుకు కుడిచెరువు ప్రాంగణంలో నర్సరీని ఏర్పాటుచేశారు. వీటిలో పలు రకాల పూల మొక్కలు, కదంబ మొక్కలున్నప్పటికీ అధికడబ్బులు వెచ్చించి పొరుగు ప్రాంతాల నుంచి కోనోకార్పస్‌ మొక్కలు తెప్పించి నాటారు. దీంతో పట్టణం కాస్త పచ్చదనం సంతరించుకున్నప్పటికీ నర్సరీలలో పూలు, నీడనిచ్చే మొక్కలు ఏపుగా పెరిగాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మొక్కలు మూలుగుతున్నాయి. మరికొన్నింటిని విత్తనాలు వేయడానికి కవర్లలో మట్టిని నింపి సంసిద్ధం చేసినప్పటికీ సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కోనోకార్పస్‌ మొక్కల వల్ల జరుగుతున్న నష్టంపట్ల సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో రోడ్డుపక్కనగల భారీవృక్షాలు, చెట్లు తొలగించినప్పటికీ డివైడర్లలోని మొక్కలు ప్రమాదకరంగా మారాయి. పట్టణ శివారులోని పెట్రోల్‌పంప్‌ నుంచి మార్కెట్‌యార్డు ఆవతలి వరకు డివైడర్లలో మొరం పోసి సుందరీకరిస్తున్న క్రమంలో కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలని, వాటిస్థానంలో పూలు, నీడ నిచ్చెమొ క్కలునాటి ప్రజారోగ్యం పరిరక్షించాలని పట్టణప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 10:52 PM