Share News

సాగుబాటతో జ్ఞానాన్ని ఒడిసి పడుతూ..

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:17 PM

జహీరాబాద్‌, ఫిబ్రవరి 29: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థినులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు వచ్చి సాగుబాట పట్టి.. జ్ఞానాన్ని ఒడిసి పడుతున్నారు.

సాగుబాటతో జ్ఞానాన్ని ఒడిసి పడుతూ..
జహీరాబాద్‌లోని రైతుల వెంట ఉంటూ పొలాల్లో పనులు చేస్తున్న విద్యార్థినులు

వ్యవసాయ సాగులో మెళకువలు నేర్చుకుంటున్న విద్యార్థినులు

జహీరాబాద్‌ వేదికగా క్షేత్రస్థాయి సందర్శనలు

జహీరాబాద్‌, ఫిబ్రవరి 29: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థినులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు వచ్చి సాగుబాట పట్టి.. జ్ఞానాన్ని ఒడిసి పడుతున్నారు. ‘గ్రామీణ ఉద్యాన పని- అనుభవ శిక్షణ’లో భాగంగా ప్రతియేటా జనవరి మొదలుకుని ఏప్రిల్‌ వరకు క్షేత్రస్థాయి సందర్శనకు ఆయా ఉద్యాన కళాశాలకు చెందిన విద్యార్థినులను యాజమాన్యాలు పంపిస్తుంటాయి. రైతుల వద్ద పంటల సాగు విధానాన్ని నేర్చుకుని పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తున్నాయి. ప్రతి సంవత్సరంలాగే.. ఈ సంవత్సరం కూడా 30 మంది విద్యార్థినులు శిక్షణ నిమిత్తం వచ్చారు. ప్రస్తుతం వారు రంజోల్‌, చిన్నహైదరాబాద్‌లో ఉంటూ రైతుల వద్ద అనుభవాలను నేర్చుకుంటున్నారు. స్థానికంగా ఉండే అధికారులు ఉద్యాన పంటలను సాగుచేసే ఒక్కో రైతుకు, ఒక్కో విద్యార్థిని అటాచ్‌ చేశారు. ఆయా విద్యార్థిని మూడునెలల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులతో ఉంటూ సాగు పద్ధతులను అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. పంటల సాగులో విత్తనాలు నాటే మొదలుకుని పంట చేతికొచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాన్ని రైతుల వెంటే ఉండి నేర్చుకుంటున్నారు. రసాయనాలు, సేంద్రియ ఎరువుల వాడకం, పంటలపై రసాయనాలను పిచికారీ చేసే విధానం, పంటల దిగుబడి, ఏయే సమయాల్లో కలుపు మొక్కలు తీయాలి, పంట చేతికి ఎప్పుడు వస్తుందనే వివరాలను రైతుల ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు.

ఉద్యాన విద్యార్థులకు శిక్షణ కేంద్రం జహీరాబాద్‌

జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఉద్యాన పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న నేపథ్యంలో జహీరాబాద్‌ విద్యార్థులకు శిక్షణ కేంద్రంగా మారింది. ఉద్యాన పంటలతో పాటు రైతులు అదనంగా జెరీనీయం, అంజీర్‌, యాపిల్‌, డ్రాగన్‌ఫ్రూట్‌, చియా(సబ్జగింజలు) తదితర కొత్తరకం పంటలను సాగుచేస్తున్నారు. వీటితో పాటు అరటి, బొప్పాయి, మామిడి, జామ, సపోట, యాపిల్‌, అల్లం, ఉల్లిగడ్డను సాగుచేస్తున్నారు. కోహీర్‌, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్‌కల్‌, జహీరాబాద్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో 20వేల పైచిలుకు ఎకరాల్లో రైతులు ఉద్యాన పంట(పండ్ల తోటలు, కూరగాయ)లను సాగుచేస్తున్నారు. అందులో 13 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 7వేల పైచిలుకు ఎకరాల్లో వివిధరకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. రంజోల్‌, హుగ్గెల్లి, చిన్నహైదరాబాద్‌, హోతి(బి), కాశీంపూర్‌, రాయిపల్లితండా, మొగుడంపల్లి, ధనసిరి, గోపన్‌పల్లి, పర్వతాపూర్‌, కవేలి, మాచిరెడ్డిపల్లి, సజ్జాపూర్‌, పిచేర్యాగడి, మనియార్‌పల్లి, ఈదులపల్లి గ్రామాల వ్యవసాయ భూములు ఉద్యాన పంటల సాగుకు యోగ్యమైనవి. గ్రామానికి చెందిన కొందరు రైతులు వివిధ ప్రాంతాలకు వెళ్లి కొత్త రకం వంగడాలను తీసుకొచ్చి అధికారుల, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ఆయారకాల పంటలను సాగు చేస్తున్నారు.

క్షేత్రస్థాయితోనే మరింత అర్థమవుతున్నది

తాము కళాశాలల్లో నేర్చుకున్న దానికంటే క్షేత్రస్థాయిలో చూసి ఎంతగానో నేర్చుకుంటున్నాం. పంటల సాగు, దిగుబడి, సస్యరక్షణ విధానం, రైతులతో అనుభవాలను పంచుకోవడం తమకు సంతృప్తినిస్తున్నది. స్థానికంగా ఉన్న వ్యవసాయ భూములన్నీ ఉద్యానపంటలకు అనుకూలమైనవి కావడంతో తమ విద్యాబోధనకు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారుల సహకారంతో ఉద్యాన పంటలను సాగుచేసే రైతుల వెంట పొలాలకు వెళ్లి కొత్త రకం సాగుతీరును చూస్తున్నాం. ఈ శిక్షణ జీవింతాతం గుర్తుండి పోయేలా ఉన్నది. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు వెన్నంటి ఉంటూ తమకు మరింత సహకరిస్తున్నారు.

- సంకీర్తన విద్యార్థిని, కరీంనగర్‌

రైతులతో కలిసి నేర్చుకోవడం సంతృప్తిగా ఉన్నది

రైతులతో కలిసి వారివెంట పొలాలకు వెళ్లి నేర్చుకోవడం తమకు ఎంతగానో సంతృప్తినిస్తున్నది. ముఖ్యంగా రైతులే నిత్యం కొత్త రకం శాస్త్రవేత్తలని ఆమె అభివర్ణించారు. వారి వద్ద అపారమైన అనుభవాలను తాము ఒంట బట్టించుకుని మరింత నేర్చుకుంటున్నాం. క్షేత్రస్థాయి సందర్శన ఉపయోగకరంగా మారి మంచి సత్ఫలితాలనిస్తున్నది. పండ్ల తోటలకు జహీరాబాద్‌ నియోజకవర్గం ఎంతగానో ప్రసిద్ధి చెందుతున్నది. మున్ముందు ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు రెట్టింపు స్థాయిలో సాగయ్యే అవకాశం ఉన్నది.

- సుప్రజ, విద్యార్థిని, నిజామాబాద్‌

విద్యార్థులకు గైడ్‌లా మారి సలహాలిస్తున్నాం

విదార్థులకు గైడ్‌లా మారి తోచినస్థాయిలో సలహాలు, సూచనలు ఇస్తున్నం. ఇలాంటి అవకాశం కొందరికి మాత్రమే వస్తున్నది. విద్యార్థుల ద్వారా కొత్త పద్ధతులను నేర్చుకుంటున్నాం. జహీరాబాద్‌ ప్రాంతంలో ఉద్యాన పంటలను ఎక్కువగా సాగుచేయడం వల్లే విద్యార్థులను క్షేత్రస్థాయి అధ్యయనం నిమిత్తం పంపిస్తున్నారు. కొత్తరకం పంటలను సైతం రైతులు సాగుచేస్తున్న తీరు విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. గతేడాది ఓబ్యాచ్‌ వచ్చి నేర్చుకుని వెళ్లారు. ఈఏడాది మరోబ్యాచ్‌ వచ్చింది. వారందరినీ రైతులకు అటాచ్‌ చేశాం.

- ప్రదీప్‌, వ్యవసాయ విస్తీర్ణాధికారి, జహీరాబాద్‌

Updated Date - Feb 29 , 2024 | 11:17 PM