Share News

దొంగతనాలకు చెక్‌

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:51 PM

చేర్యాల, ఫిబ్రవరి 7: జనసమ్మర్థం అధికంగా ఉండే కొమురవె ల్లి మల్లన్న ఆలయ రాజగోపురం, గంగిరేగు చెట్టు ప్రాంగణంలో దొంగతనాలు చోటుచేసుకోకుండా కొమురవెల్లి పోలీసులు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి.

దొంగతనాలకు చెక్‌
గంగిరేగుచెట్టు ప్రాంగణంలో పర్యవేక్షిస్తున్న పోలీసులు

ఫలిస్తున్న కొమురవెల్లి పోలీసుల వ్యూహం

గంగిరేగుచెట్టు ప్రాంగణంలో నిలిచిన అపహరణలు

20మంది పోలీసులు, సిబ్బందితో బందోబస్తు

పటిష్ఠ నిఘాతో చోరీలు తగ్గుముఖం

చేర్యాల, ఫిబ్రవరి 7: జనసమ్మర్థం అధికంగా ఉండే కొమురవె ల్లి మల్లన్న ఆలయ రాజగోపురం, గంగిరేగు చెట్టు ప్రాంగణంలో దొంగతనాలు చోటుచేసుకోకుండా కొమురవెల్లి పోలీసులు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. తద్వారా ప్రశాంతంగా మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి నెలకొనడంతో భక్తులు దొంగల బెడద నుంచి ఊరట చెందుతున్నారు. ఆలయానికి దూరంగా వాహనాలను నిలిపివేయిస్తున్న విషయంలో పలువురి నుంచి భిన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నప్పటికీ దొంగతనాల నివారణకు తీసుకున్న బందోబస్తు చర్యలను కొనియాడుతున్నారు. మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతీ ఆది, బుధవారాలలో వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. తమ కోరికలు ఈడేర్చినందుకు ప్రతిగా భక్తులు అధికసంఖ్యలో గంగరేగుచెట్టు ప్రాంగణంలో నజరు పట్నాలు రచించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంటిల్లిపాది తరలివస్తుండటంతో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. పట్నాలువేసే వారితో పాటు మహిమాన్వితమైన గంగిరేగుచెట్టుకు ముడుపులు కట్టి గండదీపానికి దండం పెట్టి ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు గుంపులో చేరి దోచుకుంటున్నారు. పలువురు మాయలేడీలు మహిళల మెడలలో నుంచి బంగారు గొలుసులు, పర్సులు కొట్టేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గతనెల 7వ తేదీన జరిగిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం రోజున తోట బావి ప్రాంగణంతో పాటు గంగిరేగుచెట్టు ఆవరణలో పలువురి మహిళలు బంగారు గొలుసులు కొట్టేసి ఉనికి చాటుకోవడంతో భక్తుల్లో అలజడి మొదలైంది.

పోలీసుల అప్రమత్తం.. పటిష్ట నిఘా

జాతర ప్రారంభంలోనే పలువురి బంగారు ఆభరణాలు అపహరణకు గురవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తుల సొమ్ము భద్రత కోసం ప్రత్యేకచర్యలు చేపట్టారు. గంగిరేగుచెట్టు ప్రాంగణం చుట్టూ పటిష్ట నిఘా కోసం సుమారు 25 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు రెండు షిఫ్టులలో పర్యవేక్షించడంతో పాటు సుమారు 20 మంది మహిళలు, పోలీస్‌ కానిస్టేబుళ్లు గస్తీ ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి ఆరాతీస్తున్నారు. అంతేకాకుండా ఆలయం లోపలికి వెళ్లే ప్రధాన మార్గమైన రాజగోపుర ఆవరణలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ పలువురు సిబ్బంది అందుబాటులో ఉండి ఆయా పరిసరాలలో పోలీసుల నిఘా ఉన్నదని తెలిపేలా చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిస్తున్నది.

భక్తులకు భరోసా కల్పించేందుకు కృషి

మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు భద్రత కల్పించి భరోసా పెంపొందింపచేసేందుకు కృషి చేస్తున్నాం. రద్ధీ అధికంగా ఉండే గంగిరేగుచెట్టు ప్రాంగణంలో పటిష్ఠ నిఘాతో పర్యవేక్షిస్తున్నాం. దీంతో మూడువారాల జాతరలో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

- నాగరాజు, కొమురవె ల్లి ఎస్‌ఐ

Updated Date - Feb 07 , 2024 | 11:51 PM