Share News

తొలిరోజే బోణి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:12 PM

పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తొలిరోజే బోణి
ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందర్‌రావు

మొదలైన నామినేషన్ల ఘట్టం

జహీరాబాద్‌కు ఒకటి, మెదక్‌కు నాలుగు నామినేషన్లు దాఖలు

సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద మునుపెన్నడూ లేని భద్రతా చర్యలు

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 18 : పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియకు తెరలేచింది. సంగారెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, మెదక్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ గురువారం పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. తొలిరోజు జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక నామినేషన్‌ దాఖలయ్యింది. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. తొలి రోజు కాంగ్రెస్‌ అభ్యర్థి సురే్‌షషెట్కార్‌ తరఫున ఆయన అనుచరులు సాగర్‌తో పాటు నలుగురు కార్యకర్తలు ఒక్క సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. మెదక్‌ లోక్‌సభ స్థానానికి మెదక్‌ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు తరఫున మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థి దొడ్ల వెంకటేశం, స్వతంత్ర అభ్యర్థి చిక్కుపల్లి నవీన్‌కుమార్‌ తమ నామినేషన్లు సమర్పించారు. నలుగురు అభ్యర్థుల తరఫున ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు.

నో ఎంట్రీ..!

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 18 : నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయమైన సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద మునుపెన్నడూ లేనివిధంగా భద్రతా చర్యలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో, కలెక్టరేట్‌ నుంచి సంగారెడ్డిలోకి వెళ్లే దారిలో 500 మీటర్ల దూరంలోనే బారికేడ్లను పెట్టేశారు. కలెక్టరేట్‌ మెయిన్‌ గేట్‌ వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. కలెక్టరేట్‌కు పనుల కోసం వచ్చే సాధారణ ప్రజలను రానివడం లేదు. మీడియా ప్రతినిధులను ఎంట్రెన్స్‌ వద్ద ఏర్పాటు చేసిన షామియానా వరకు మాత్రమే అనుమతించారు. కనీసం డీపీఆర్వో కార్యాలయంలోకి వెళ్లనీయడం లేదు. జిల్లాస్థాయి అధికారుల వాహనాలను కూడా లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. జిల్లాస్థాయి అధికారులు కూడా పోలీసులకు తమ గుర్తింపు కార్డులను చూపించి కలెక్టరేట్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. దశాబ్దాల కాలంగా ఎన్నికలు జరుగుతున్నా ఇలాంటి భద్రతా చర్యలు మునుపెన్నడూ కనిపించలేదని పలువురు అధికారులే అంటున్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రంగా కొనసాగిన సంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మెదక్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అఽధికారిగా, జాయింట్‌ కలెక్టర్‌ జహీరాబాద్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా పనిచేశారు. ఆ సమయంలోనూ ఇంతటి అసాధారణ భద్రతా చర్యలు లేవని, అయినా నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా స్థాయి అధికారి ఒకరు గుర్తుచేశారు.

Updated Date - Apr 18 , 2024 | 11:12 PM