Share News

భగ్గుమన్న బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:50 PM

కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు

భగ్గుమన్న బీఆర్‌ఎస్‌
బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి 16: లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ఆ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఈడీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గజ్వేల్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన భూంపల్లిలో నిర్వహించిన ఆందోళనలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రమైన మద్దూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టబొమ్మను, మండలకేంద్రమైన అక్కన్నపేట అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దహనం చేశారు.

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో

సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు కొత్త బస్టాండ్‌ వద్ద నల్ల కండువాలు ధరించి రాస్తారోకో నిర్వహించారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు నాయకత్వంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌ తదితరులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పటాన్‌చెరులో కార్పొరేటర్‌ కుమార్‌యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై భైఠాయించారు. నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి రాస్తారోకో నిర్వహించారు. జోగిపేటలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో రాందాస్‌ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునితారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు రహదారిపై బైఠాయించారు. కాగా తూప్రాన్‌లో ఎలాంటి ఆందోళనలు చేయకపోవడం గమనార్హం.

Updated Date - Mar 16 , 2024 | 11:50 PM