Share News

క్రాస్‌ ఓటింగ్‌తో బెంబేలు

ABN , Publish Date - May 14 , 2024 | 11:43 PM

జహీరాబాద్‌లో ఉత్కంఠ పలుచోట్ల బీజేపీకి అనుకూలంగా బీఆర్‌ఎస్‌? అధినేతలూ పట్టించుకోలే..

క్రాస్‌ ఓటింగ్‌తో బెంబేలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 14: పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న సమాచారంతో బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక మొదలు ఎన్నికలు ముగిసే వరకు బీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆ పార్టీ ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ బీజేపీలో చేరడం బీఆర్‌ఎ్‌సను అయోమయానికి గురిచేసింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం అన్వేషణ సాగించింది. నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు పోటీకి భయపడటంతో తప్పని పరిస్థితుల్లో నాయకత్వం నియోజకవర్గంతో సంబంధం లేని పార్టీ నాయకుడు గాలి అనిల్‌కుమార్‌ను ఎంపిక చేసింది. ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో ఈయన అభ్యర్థిత్వాన్ని నాయకత్వం ఖరారు చేసింది. అయితే మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేసిన అనిల్‌కుమార్‌కు జహీరాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ ఇవ్వడంతో ఆయన నిరాశకు గురయ్యారు. పోటికి విముఖత కనబరిచి అప్పట్లో మూడు నాలుగు రోజుల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ అగ్రనేత హరీశ్‌రావు కల్పించుకుని నచ్చజెప్పడంతో అనిల్‌కుమార్‌ పోటీకి సిద్ధమయ్యారు. అయినా నాయకత్వం ఆశించిన స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టకపోవడంతో పార్టీ గెలుపుపై మొదటి నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఎన్నికల వరకు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడంలో పేరున్న పార్టీ నాయకత్వం ఈ ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో చేతులెత్తేసిందన్న ప్రచారం సాగింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలోని పార్టీ కార్యకర్తలు బీజేపీకి సానుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు పోలింగ్‌ సరళిని పరిశీలించిన అసెంబ్లీ సెగ్మెంట్ల బీఆర్‌ఎస్‌ నాయకులను ఒకింత కలవరపాటుకు గురిచేశాయి. క్రాస్‌ ఓటింగ్‌ జరిగిన ఇలాంటి పరిస్థితుల్లో పెద్దగా క్యాడర్‌, లీడర్‌ బలంగా లేని బీజేపీ ఒక్కసారిగా కాంగ్రె్‌సతో నువ్వా-నేనా అన్న స్థాయికి రావడం భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోని బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక నుంచి తడబడడం తమను అయోమయానికి గురిచేసిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. దీనికి తోడు ఉమ్మడి జిల్లా నేతగా ఉన్న మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డిని గెలిపించుకోవడంపై కనబరిచిన శ్రద్ద, ప్రచారం ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై కనబర్చకపోవడం సైతం తమను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిందని పార్టీ నాయకుడొకరు వాపోయారు.

Updated Date - May 14 , 2024 | 11:43 PM