Share News

గ్రూప్‌-1కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:54 PM

జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలు

గ్రూప్‌-1కు పకడ్బందీ ఏర్పాట్లు
రూట్‌, డిపార్ట్‌మెంట్‌, ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ ఇస్తున్న కలెక్టర్‌ మనుచౌదరి

8,223 మంది అభ్యర్థులు

సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

సిద్దిపేట క్రైం, జూన్‌ 7 : గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల్లో 8,223 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10.30కు పరీక్ష ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నది. నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన అనుమితంచబోమని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్‌ తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను నిషేధించారు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్‌టికెట్‌, మాత్రమే తీసుకురావాలి. పాథమిక పరీక్షకు బయోమెట్రిక్‌ హాజరును నమోదు చేస్తారు. మెహిందీ, టాటూలు వేసుకోవద్దని సూచిస్తున్నారు.

పరీక్షా కేంద్రాల వివరాలు

సిద్దిపేట పట్టణంలో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొన్నాల గ్రామ శివారు ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఏ, సీ, డీ, ఈ బ్లాక్‌లలో నాలుగు కేంద్రాలను, మెదక్‌ రోడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. మిగతావి పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నాయి.

298 మందితో బందోబస్తు

ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్‌ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 21 మంది ఎస్‌ఐలు, 257 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు.. మొత్తం 298 మందితో బందోబస్తులో ఉండనున్నారు. కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ బి.అనురాధ తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరార్స్‌ సెంటర్లు, ఇంటర్‌నెట్‌ షాపులను మూసివేయాలని, చుట్టుపక్కల లౌడ్‌స్పీకర్లు పెట్టొద్దని, 500 మీటర్ల వరకు ప్రజలు ఎవరూ గుమిగూడ వద్దని ఆదేశించారు. పరీక్షా సమయానికే 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. కేంద్రాలకు సమీపంలో పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మూడు రూట్‌ మొబైల్‌, మూడు ఎస్కార్ట్‌ పార్టీలను ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల ప్రాంతాల్లో ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు.

సజావుగా నిర్వహించాలి : కలెక్టర్‌ మనుచౌదరి

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూన్‌ 7 : గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌, గ్రూప్‌-1 పరీక్ష జిల్లా నోడల్‌ అధికారి గరీమా అగ్రవాల్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే, రూట్‌, డిపార్ట్‌మెంట్‌, ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, రక్షణ ఏర్పాట్లు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించి, పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు తగు సూచనలివ్వాలని ఆదేశించారు.

Updated Date - Jun 07 , 2024 | 11:54 PM