Share News

కాలువ పనులు కంచికేనా?

ABN , Publish Date - May 31 , 2024 | 11:43 PM

నిలిచిపోయిన ప్యాకేజీ-18 కాళేశ్వరం పనులు రెండు నెలలుగా ముందుకుసాగని వైనం పూర్తి చేయకుండానే వెళ్లిపోయిన సిబ్బంది, కూలీలు

కాలువ పనులు కంచికేనా?
రెడ్డిపల్లి సమీపంలో సొరంగం ద్వారా చేపట్టిన కాలువ పనులు నిలిచిపోయిన దృశ్యం

నర్సాపూర్‌, మే 31: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి మెదక్‌ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పనిచేసే సిబ్బంది కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో కాలువ పనులు ఇక కంచికేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మెదక్‌ జిల్లా పరిఽధిలో కాలేశ్వరం కాలువ పనులు తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లిలో ప్రవేశించి నర్సాపూర్‌ మండలం నాగులపల్లి వరకు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోకి 19వ ప్యాకేజీ కింద వెళ్తాయి.

731 మంది రైతుల నుంచి 606 ఎకరాల భూ సేకరణ

18వ ప్యాకేజీ కింద నర్సాపూర్‌ డివిజన్‌ పరిధిలో శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి, దంతాన్‌పల్లి, నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట, రెడ్డిపల్లి, మంతూరు, తుజాల్‌పూర్‌, ఖాజీపేట గ్రామాలు, కౌడిపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామాల నుంచి 731 మంది రైతుల నుంచి 606 ఎకరాల భూమిని సేకరించి, 2018లో కాళేశ్వరం కాలువ పనులు మొదలు పెట్టారు. పరిహారం విషయంలో అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం అయినా రైతులకు పట్టాభూమికి ఎకరాకు రూ.7.50లక్షలు, అసైన్డు భూమికి ఎకరాకు రూ.5.50లక్షలు మాత్రమే చెల్లించారు. ఎంతో విలువైన భూములకు పరిహారం చాలా తక్కువగా ఇచ్చారని రైతుల్లో ఆవేదన ఉన్నా నియోజకవర్గంలో కాళేశ్వరం కాలువ వల్ల ఇతరుల భూములకైనా సాగునీరు పుష్కలంగా నిరంతరం అందుతుందన్న సంతోషంలో ఉన్నారు.

44 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం

18వ ప్యాకేజీలో సుమారు 44 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం చేపడుతున్నారు. అందులో నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లి సమీపంలో 3.50 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా కాలువ పనులు చేపట్టారు. ప్యాకేజీ పనులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో నత్తనడకన సాగుతూ వచ్చాయి. సిద్దిపేట జిల్లా పరిధిలో కాళేశ్వరం కాలువ పనులు పూర్తి కాగా మెదక్‌ జిల్లా పరిధిలోని 18వ ప్యాకేజీ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం.. కాంగ్రెస్‌ నాయకులు మొదటి నుంచీ కాలేశ్వరం విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే దానిపై విచారణ చేపడుతామని పేర్కొంటూవచ్చారు. కారణమేదైనా మెదక్‌ జిల్లాలోని 18వ ప్యాకేజీ పనులు రెండు నెలల క్రితం నుంచి జరగడం లేదు. పనులు నిలిపివేయడమే కాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికులు, కూలీలందరిని పనులు చేపట్టిన సంస్థ పంపించివేసింది. ఈ ప్యాకేజీలో చేపట్టిన కాలువ పనులు దాదాపు పూర్తయి చివరిదశలో ఉండగా సొరంగం ద్వారా తీస్తున్న కాలువ ఇప్పటివరకు 2.50కిలోమీటర్ల మేర పూర్తయి ఇంకా కిలోమీటరు మేర చేపట్టాల్సి ఉంది. ఆ పనులు పూర్తయితే 18వ ప్యాకేజీ పనులు దాదాపు పూర్తయే అవకాశమున్నా పనులు చేపట్టిన సంస్థ ప్రభుత్వం మారిందన్న ఉద్దేశంతోనో లేక మరే కారణమోగానీ పనులు పూర్తి చేయకుండానే వదిలేయడం చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం కేవలం సెక్యురిటీ సిబ్బందితో పాటు ఒకరిద్దరు అక్కడ ఉన్న సామగ్రి, ఇతర వస్తువులకు కాపలాగా ఉంటున్నారు.

మా త్యాగానికి ఫలితం దక్కదా?

కాళేశ్వరం కాలువ పూర్తయితే నర్సాపూర్‌ నియోజకవర్గంలోని సాగు నీటికి ఇబ్బంది ఉండదని, ఈ కాలువ ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపి నిరంతరం నీరు ఉండేలా చేస్తామని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాలువ పూర్తికాకుండానే పనులు నిలిపివేయడంతో భూములు ఇచ్చిన రైతులు భూములు ఇచ్చి త్యాగం చేసినా ఫలితం లేకుండా పోతుందా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్యాకేజీ పనులకు ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తిని ఫోన్‌ ద్వారా సంప్రదించగా తాను కూడా రెండు నెలల క్రితమే వేరే ప్రాజెక్టుకు వెళ్లినట్లు తెలిపారు. పనులు ఆగిపోవడానికి గల కారణాలు తనకు తెలియవని సమాఽఽధానమిచ్చారు.

త్వరలోనే పనులు చేపట్టేలా చర్యలు: ఈఈ

ప్రభుత్వం మారినందున నిర్వహణ సంస్థ బిల్లులు వస్తాయో రావో అనే ఉద్దేశంతో ప్రస్తుతం పనులు నిలిపివేసిన మాట వాస్తవమే అని ప్రాజెక్టు ఈఈ రవీందర్‌ తెలిపారు. త్వరలోనే తిరిగి పనులు చేపట్టి కాలేశ్వరం కాలువను పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. మరీ పనులు తిరిగి ప్రారంభమవుతాయో లేదో వేచి చూడాల్సిందే.

Updated Date - May 31 , 2024 | 11:43 PM