సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అపర్ణపాటిల్
ABN , Publish Date - Mar 04 , 2024 | 11:07 PM
సదాశివపేట, మార్చి 4 : సదాశివపేట మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ చీలిక వర్గానికి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో 26 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది మద్దతుతో అపర్ణపాటిల్ చైర్‌పర్సన్‌గా పదవీ ప్రమాణం చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
పార్టీలు పక్కనపెట్టి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు
సదాశివపేట, మార్చి 4 : సదాశివపేట మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ చీలిక వర్గానికి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో 26 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది మద్దతుతో అపర్ణపాటిల్ చైర్‌పర్సన్‌గా పదవీ ప్రమాణం చేశారు. ఫిబ్రవరి 9న నిర్వహించిన సమావేశింలో 21 మంది కౌన్సిలర్ల ఓట్లతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్‌పర్సన్‌గా ఉన్న పిల్లోడి జయమ్మ పదవిని కోల్పోయారు. సోమవారం కొత్త చైర్‌పర్సన్ ఎన్నికను నిర్వహించారు.
18 మంది కౌన్సిలర్ల మద్దతు
స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రిసైడింగ్ అధికారి, సంగారెడ్డి ఆర్డీవో వసంతకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోరంకు అవసరమైన 19 మంది కౌన్సిల్ సభ్యులు హాజరవడంతో ఆర్డీవో ఎన్నిక జరిపారు. 23వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కొత్త చైర్‌పర్సన్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ చీలిక వర్గానికి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణపాటిల్ పేరును ప్రతిపాదించారు. 20వ వార్డు కౌన్సిలర్ ఆకుల శివకుమార్ బలపరిచారు. 18 మంది కౌన్సిలర్లు అనుకూలంగా మద్దతును ప్రకటించారు. దీంతో ఆర్డీవో వసంతకుమారి కొత్త చైర్‌పర్సన్‌గా అపర్ణపాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ధ్రువీకరించారు. అనంతరం చైర్‌పర్సన్ అపర్ణపాటిల్ పదవీ ప్రమాణం చేశారు.
మద్దతు తెలిపిన కౌన్సిలర్లు వీరే..
కొత్త చైర్‌పర్సన్ ఎన్నిక ప్రత్యేక సమావేశంలో 19 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ముంతాజ్‌బేగం, రేష్మాబేగం, రజియాబేగం, నస్రీన్‌బేగం, వడ్ల మహేశ్వరి, నల్ల శివలక్ష్మి, ఇంద్రమోహన్‌గౌడ్, చౌదరి ప్రకాష్, విద్యాసాగర్‌రెడ్డి, చింతా గోపాల్, ఆకుల శివకుమార్, బీజేపీ కౌన్సిలర్ ఓదెల రాజేశ్వరి, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు ఖుద్దుస్ ఖురేషీ, షహజాదీబేగం, బీఆర్‌ఎ్‌సలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్ ఇలియాజ్‌షరీ్‌ఫతో పాటు కాంగ్రె్‌సను వీడి బీఆర్‌ఎ్‌సలో చేరిన కౌన్సిలర్లు పిచరాగడి రేణుక, సాతాని లలిత, నేనావత్ శ్రీనివాస్ అపర్ణపాటిల్‌కు మద్దతు పలికారు. చైర్‌పర్సన్ ఎన్నికలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలేవి విప్ నోటీసులను ప్రిసైడింగ్ అధికారికి అందజేయలేదు.
రేపు తూప్రాన్ మున్సిపల్ అవిశ్వాస సమావేశం
తూప్రాన్, మార్చి 4: తూప్రాన్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన సమావేశం బుధవారం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై 11 మంది కౌన్సిలర్లు సంతకం చేసి గతనెల 11న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లారు. చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ వర్గం ఐదుగురితో క్యాంపునకు తరలివెళ్లింది. అవిశ్వాసంపై సంతకం చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ ఇంటి వద్ద పనుందంటూ వచ్చి చైర్మన్ వర్గంలో కలిసిపోయాడు. దీంతో చైర్మన్ వర్గంలో ఆరుగురయ్యారు.
భూకబ్జా కేసులే కీలకం!
తూప్రాన్ పట్టణంలోని పుట్టకోటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయించారంటూ ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే ఆధారంగా కౌన్సిలర్, ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలపై పోలీసులు నాలుగు రోజుల క్రితం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అవిశ్వాసంలో పోలీసులు కేసులు కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.