Share News

రాజకీయ జీవితాన్నిచ్చిన అందోలు.. తల్లిలాంటి జోగిపేట

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:57 PM

రాజకీయ జీవితాన్నిచ్చిన అందోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులను స్వీకరించారు.

రాజకీయ జీవితాన్నిచ్చిన అందోలు.. తల్లిలాంటి జోగిపేట

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా.. ప్రజల రుణం తీర్చుకుంటా

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

జోగిపేట, జనవరి 5: రాజకీయ జీవితాన్నిచ్చిన అందోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోగిపేట పట్టణం తనకు తల్లిలాంటిదని అన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని తెలిపారు. పదేళ్లుగా నియోజకవర్గం అన్నిరంగాల్లో వెనుకబడిందని, సమస్యలను పరిష్కరించి నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వారికి కావాల్సిన సంక్షేమ పథకాలను అందించడానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షమ ఫలాలు అందజేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగమే వార్డులు, గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి అర్జీలను తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని కౌన్సిలర్‌ చిట్టిబాబు దంపతులు, కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు.

తొమ్మిదిన్నరేళ్ల అనంతరం ప్రజల పాలన..

వట్‌పల్లి : తొమ్మిదిన్నరేళ్ల రాచరిక పాలన నుంచి విముక్తి పొందిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనను ప్రారంభించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. మండల కేంద్రమైన వట్‌పల్లిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారిని ఎంపికచేసి పథకాలు అందేలా చూస్తామన్నారు. వట్‌పల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. వట్‌పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి, డయాలసిస్‌ సెంటర్‌, 108 వాహనం, వట్‌పల్లి చౌరస్తాలో ఫ్లడ్‌టైట్లను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం గొర్రెకల్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు పోలీస్‌ శేఖర్‌ను మంత్రి పరామర్శించారు. శేఖర్‌ తల్లి ఇటీవల మృతి చెందగా మంత్రి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాధురి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీపీ కృష్ణవేణి, సర్పంచ్‌ సురేఖ, ఎంపీటీసీ ఇంద్రాబాయి, సర్పంచ్‌ రమేష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రమే్‌షజోషి, మాజీ ఎంపీపీ పత్రి విఠల్‌, శ్రీకాంత్‌రెడ్డి, విశ్వాస్‌, మాణిక్‌గౌడ్‌, దిగంబర్‌రావు, గోపాల్‌రెడ్డి, నరసింహాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో మంత్రి తనిఖీలు

జోగిపేట, జనవరి 5: జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను సందర్శించి అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలో వసతులను గురించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానా ఆవరణను పరిశీలించి సిబ్బందిని అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించి ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు చిట్టిబాబు, సురేందర్‌గౌడ్‌, శంకర్‌, రేఖా ప్రవీణ్‌, సురేష్‌, హరికృష్ణగౌడ్‌, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు ప్రదీ్‌పగౌడ్‌, శరత్‌ బాబు, గోహేర్‌అలీ, నాయకులు శ్రీనివాస్‌, రాజశేఖర్‌, మధు, భాస్కర్‌, అనిల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:58 PM