Share News

అందరి చూపు మెదక్‌ వైపు

ABN , Publish Date - May 15 , 2024 | 11:46 PM

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందరి దృష్టి మాత్రం మెదక్‌ స్థానంపైకి మళ్లింది. ఇక్కడ పోలింగ్‌ జరిగిన తీరుపై రాష్ట్ర నలుమూలల నుంచి ఆరా తీస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, నాయకులతోపాటు సాధారణ వ్యక్తులు సైతం ఓటింగ్‌ సరళి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

అందరి చూపు మెదక్‌ వైపు

సిట్టింగ్‌ స్థానంపై బీఆర్‌ఎస్‌ ధీమా

ఆద్యంతం దృష్టిపెట్టిన కేసీఆర్‌, హరీశ్‌రావు

రేసులోనే కాంగ్రెస్‌, బీజేపీ

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌

పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల పోస్టుమార్టం

ఎవరికి వారే గెలుపుపై గంపెడాశలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 15 : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందరి దృష్టి మాత్రం మెదక్‌ స్థానంపైకి మళ్లింది. ఇక్కడ పోలింగ్‌ జరిగిన తీరుపై రాష్ట్ర నలుమూలల నుంచి ఆరా తీస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, నాయకులతోపాటు సాధారణ వ్యక్తులు సైతం ఓటింగ్‌ సరళి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాము డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సాధిస్తామని బీఆర్‌ఎస్‌ చెబుతున్నప్పటికీ.. కచ్చితంగా గెలిచే వాటిలో మెదక్‌ మొదటి స్థానంలో ఉంటుందని, ఇక్కడ గెలవకుంటే రాష్ట్రంలో ఇంకెక్కడా ఆ పార్టీకి అనుకూల పరిస్థితి లేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మెదక్‌ ఫలితం ఆసక్తిగా మారింది.

మెదక్‌ పార్లమెంట్‌కు సంబంధించి అనూహ్యరీతిలో పోలింగ్‌ శాతం నమోదైంది. అంచనాలకు భిన్నంగా 75.09 శాతం నమోదు కావడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతాన్ని పోల్చితే నాలుగు శాతం ఎక్కువగా నమోదైంది. ఈ లెక్కన దాదాపు 60వేల మంది అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్‌సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో 2,124 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం 18,28,210 ఓటర్లకుగాను 13,72,894 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేసీఆర్‌, హరీశ్‌ల కంచుకోట..

2004 నుంచి 2019 వరకు ఇక్కడ ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో కేసీఆర్‌ ఎంపీగా విజయం సాధించినప్పటికీ గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ 3లక్షలకు పైగా భారీ మెజారిటీతో మరోసారి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్‌ఎ్‌సకు ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పటికీ మెదక్‌ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరింట గులాబీ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట అసెంబ్లీ కూడా ఈ లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే 2.40 లక్షల ఓట్లు, బీజేపీతో పోల్చితే 4.50 లక్షల ఓట్లు ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో బీఆర్‌ఎ్‌సకు అధికంగా పోలయ్యాయి. ఈ లెక్కన తాజా పార్లమెంటు ఎన్నికల్లో కనీసం లక్ష మెజారిటీ అయినా వస్తుందని బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ భారీగా మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

ఆద్యంతం బీఆర్‌ఎస్‌ ఫోకస్‌..

మెదక్‌ స్థానంపై అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికలు పూర్తయ్యేదాకా బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. పార్టీ అభ్యర్థిగా ఎవరుంటారనే దానిపై విస్తృతమైన చర్చపెట్టారు. ఒకానొక దశలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులు కూడా బరిలో ఉండొచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న మాజీ కలెక్టర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డిని అనూహ్యంగా తెరమీదకు తెచ్చారు. ఇదే లోక్‌సభ పరిధిలోని తెల్లాపూర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆయన వచ్చీ రాగానే రూ.100 కోట్ల సొంత డబ్బులను పేదలు, విద్యార్థులు, యువత సంక్షేమం కోసం ఖర్చుచేస్తానని సంచలనానికి తెరలేపారు. తన కుటుంబం మీద ప్రమాణం చేసి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. వెంకట్రామారెడ్డి వెన్నంటే హరీశ్‌రావు ప్రచారంలో అన్నీతానై వ్యవహరించారు. కేసీఆర్‌ సైతం మెదక్‌, సిద్దిపేట, నర్సాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీల పరిధిలోని ప్రజలతో సభలు, రోడ్‌షోలు నిర్వహించారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌, బీజేపీ..

1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించిన ఈ స్థానాన్ని దక్కించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పలువురు ఆశావహులు పోటీపడినప్పటికీ బీసీ, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును బరిలోకి దింపారు. నామినేషన్‌ కార్యక్రమానికి స్వయంగా మెదక్‌కు వచ్చిన రేవంత్‌ ఆ తర్వాత సిద్దిపేట, పటాన్‌చెరులో రోడ్‌షోలు నిర్వహించారు. నర్సాపూర్‌లో రాహుల్‌గాంధీతో భారీ సభ నిర్వహింపజేశారు. మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి సైతం నియోజకవర్గాల వారీగా విస్తృత పర్యటనలు చేసి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.

ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా ఈ ఎన్నికను చావోరేవో అన్నట్లుగా తీసుకున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుంచి ఎన్నికలు ముగిసేదాకా అవిశ్రాంత పర్యటనలు చేశారు. కులాలు, వర్గాల సమీకరణతోపాటు మోదీ మేనియాను వాడవాడలా ప్రచారం చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సిద్దిపేటలో సభను ఏర్పాటు చేయించారు. మెదక్‌జిల్లా అల్లాదుర్గంలో జరిగిన మోదీ సభకు జనాన్ని తరలించారు. అన్ని వర్గాలను సంఘటితం చేసుకొని తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

పోలింగ్‌ సరళిపై పోస్టుమార్టం..

రాష్ర్టాన్ని ఆకర్షిస్తున్న మెదక్‌ స్థానంలో పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు పోస్టుమార్టం ప్రారంభించారు. జూన్‌ 4 వరకు ఉత్కంఠను భరించలేక బూత్‌ల వారీగా పోలింగ్‌ వివరాలను తెప్పించుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పరిణామాలు, అనుకూల, ప్రతికూలతల ఆధారంగా ఓటర్లు ఎవరివైపు నిలిచారో ఒక అంచనాకు వస్తున్నారు. ప్రాథమిక అంచనాలో మాత్రం ముగ్గురు అభ్యర్థులు గెలుపుపై పూర్తిధీమాతో కనిపిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో స్వల్ప మెజారిటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇక సంగారెడ్డి, మెదక్‌, పటాన్‌చెరు, నర్సాపూర్‌, గజ్వేల్‌పై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకోగా.. దుబ్బాక, గజ్వేల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, పటాన్‌చెరులో అనుకూల పరిస్థితులు కనిపించాయని బీజేపీ ధీమాతో ఉంది. రైతులు, వృద్దులు, పటిష్టమైన కార్యకర్తల బలమే తమను గెలిపిస్తుందని బీఆర్‌ఎస్‌.. మహిళలు, నిరుద్యోగులు, క్యాడర్‌ బలంపై కాంగ్రెస్‌.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు, హిందుత్వవాదుల మద్దతుపైన బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - May 15 , 2024 | 11:46 PM