Share News

దూకుడు

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:33 PM

నామినేషన్లకు ముందే పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రస్తుతం వారంతా ప్రజాక్షేత్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పరస్పర ఆరోపణలు, వాగ్దానాలతో పాటు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరనున్నది

దూకుడు
aggression

నామినేషన్లకు ముందే ప్రచార హోరు

నియోజకవర్గాలు, మండలాల వారీగా మీటింగ్‌లు

పోటాపోటీగా ప్రచారరథాల ఆర్భాటం

వ్యక్తులు, సంఘాల వారీగా ముఖాముఖీ

ఈనెల 18 నుంచి 25వరకు నామినేషన్ల స్వీకరణ

మెదక్‌ పార్లమెంటు పరిధిలో ఎన్నికల జోష్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 14: నామినేషన్లకు ముందే పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రస్తుతం వారంతా ప్రజాక్షేత్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పరస్పర ఆరోపణలు, వాగ్దానాలతో పాటు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరనున్నది.

మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో ఎన్నికల జోష్‌ నెలకొన్నది. పోలింగ్‌కు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. నామినేషన్లు సమర్పించడానికి ముందే అన్ని మండలాల్లో పర్యటించాలని నడుంబిగించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత తమ అధినాయకులతో బహిరంగ సభలు తలపెట్టాలనే యోచనలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులూ ఇదే వైఖరితో కనిపిస్తున్నారు.

హరీశ్‌, వెంకట్రామారెడ్డి జోరు

మెదక్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకునే మొదటి స్థానంగా మెదక్‌ ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. అయితే 2004, 2009, 2014లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, 2014 ఉపఎన్నికలు, 2019లో అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్‌ ఎ్‌సకు కలిసొచ్చింది. ఈసారి అధికారాన్ని కోల్పోవడం కాస్త ఇబ్బందిగా భావిస్తున్నారు. ఈ లోటును పూడ్చడానికి మాజీమంత్రి హరీశ్‌రావు తానే అభ్యర్థి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డితో కలిసి జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు. మెదక్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు స్థానాలుంటే ఆరుచోట్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ సగానికిపైగా మండలాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో మమేకమై సమావేశాలు నిర్వహించారు. నామినేషన్లు ముగిసే నాటికి అన్ని మండలాలపై ఫోకస్‌ చేస్తున్నారు. చేరికల సంగతి పక్కనబెడితే పార్టీలో అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

చేరికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో తమకు అనుకూలంగా లేని నియోజకవర్గాలపై ఆ పార్టీ పెద్దలు దృష్టిసారించారు. ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించినప్పటికీ ఆయన ప్రచారంలో మాత్రం పుంజుకోలేదు. సిద్దిపేట, గజ్వేల్‌, సంగారెడ్డి, నర్సాపూర్‌, పటాన్‌చెరు, దుబ్బాక నియోజకవర్గాల్లో తమ బలాన్ని పెంచుకోవడానికి నిమగ్నమయ్యారు. ఇటీవలే పలువురు ముఖ్యులు బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గూటికి వెళ్లారు. తాజాగా గజ్వేల్‌లోనూ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. ఇక మెదక్‌ లోక్‌సభకు 18 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 9 దఫాలుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించిన రికార్డు ఉంది. ఇందిరాగాంధీ కూడా మెదక్‌లో విజయం సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు. ఇందిరా నియోజకవర్గంగా పేరున్న మెదక్‌ను మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు తూర్పుజగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు తమ పార్టీ అభ్యర్థి నీలం మధు వెన్నంటే ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో రఘునందన్‌ నిమగ్నం

అందరికంటే ముందుగా బీజేపీ అభ్యర్థిగా ఖరారైన మాధవనేని రఘునందన్‌రావు ముందస్తుగానే ప్రచారంలో దిగారు. అభ్యర్థిగా తనకే అవకాశం ఉంటుందనే ధీమాతో ప్రచార రథాలు తయారు చేయించారు. తన పేరు ఖరారైన వెంటనే ప్రజాక్షేత్రంలో ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడమే కాకుండా కులాలు, వర్గాల వారీగా కూడా ముఖాముఖీ సమావేశమవు తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉండడంతో ఈసారి జాగ్రత్త వహిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. పార్లమెం టు ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఎంపీగా గెలవాలనే పట్టుదలతో పర్యటిస్తున్నారు. 1999లో ఆలె నరేంద్ర బీజేపీ నుంచి ఈ స్థానంలో గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు ముఖ్యనేతలు రఘునందన్‌ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:33 PM