Share News

మల్లన్న భక్తులకు అందని అభిషేకం లడ్డూ

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:42 PM

చేర్యాల, ఫిబ్రవరి 28: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు ఆర్జితసేవలు నిర్వహించిన వారికి అందించే అభిషేకం లడ్డూ ప్రసాదం కరువవుతున్నది.

మల్లన్న భక్తులకు అందని అభిషేకం లడ్డూ
ఆలయంలో తయారుచేస్తున్న లడ్డూ ప్రసాదం

టెండర్‌ నిబంధనలు బేఖాతరు

100 గ్రాముల పరిమాణం గల లడ్డూ తయారీకి కిలోకు రూ.38

400 గ్రాముల అభిషేక లడ్డూ తయారీకి కిలోకు 1పైసా చొప్పున టెండర్‌

లేబర్‌ చార్జీల చెల్లింపులో భారీ వ్యత్యాసంతో విముఖం

ఆలయాధికారుల మౌనం

చేర్యాల, ఫిబ్రవరి 28: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు ఆర్జితసేవలు నిర్వహించిన వారికి అందించే అభిషేకం లడ్డూ ప్రసాదం కరువవుతున్నది. అభిషేకం లడ్డూలు అందుబాటులో ఉండేలా చూడాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు గతంలో ఆదేశాలిచ్చినా ఇక్కడ మాత్రం తుంగలో తొక్కుతున్నారు. ఆలయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వలన టెండర్‌దారుడికి కలిసి వస్తుండమే కాకుండా ఆలయానికి అనవసర భారం మోపుతున్నారు. సాధారణంగా విక్రయించే 100 గ్రాముల పరిమాణం లడ్డూకు, 400 గ్రాముల పరిమాణం గల అభిషేకం లడ్డూ తయారీకి చెల్లించే లేబర్‌ చార్జీలలో భారీ వ్యత్యాసం ఉండటంతో కాంట్రాక్టర్‌ విముఖంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆలయం ఆధ్వర్యంలోనే లడ్డూ ప్రసాదం తయారు చేసేవారు. కానీ నిర్వహణ భారంగా మారడంతో కొన్నాళ్లుగా ముడి సరుకులిచ్చి తయారు చేయిస్తున్నారు. అందుకు టెండర్లు నిర్వహించి లేబర్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు తక్కువ లేబర్‌ చార్జీ ధరకు అభిషేకం లడ్డూను, ఎక్కువ ధరకు సాధారణ లడ్డూ తయారీ చేయించి ఇస్తామని టెండర్‌ పొందినప్పటికీ ఏమాత్రం గిట్టుబాటు కాదన్న కారణంగా అభిషేకం లడ్డూను విస్మరించి వాటిస్థానంలో సాధారణ లడ్డూలు అందిస్తూ టెండర్‌ నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నారు. తద్వారా భక్తులకు అభిషేకం లడ్డూ అందుబాటులో ఉండకపోవడంతో ఉసూరుమంటున్నారు.

వీఐపీ దర్శనం, అభిషేకం, కల్యాణం చేసిన భక్తులకు లడ్డూ

మల్లన్న నిత్య కల్యాణంలో పాల్గొన్నవారితో పాటు అభిషేకం చేస్తున్న భక్తులు రూ.900 చెల్లించి టికెట్‌ తీసుకుంటున్నందుకు ఆలయవర్గాలు ఆశీర్వాద పూర్వకంగా ఓం నమఃశ్శివాయ జరీ షల్లా, రెండు జాకెట్‌ పీసులతో పాటు 400 గ్రాముల అభిషేకం లడ్డూ ప్రసాదం అందించాల్సి ఉన్నది. రూ.500 చెల్లించి వీవీ ఐపీ ప్రత్యేక దర్శన టికెట్‌ తీసుకున్న వారికి ఉచితంగా అభిషేకం లడ్డూను అందజేయాల్సి ఉన్నది. గతంలో కొద్దిమంది మాత్రమే ఆర్జితసేవలు జరిపినా రానురాను సంఖ్య పెరుగుతూ వస్తున్నది.

ఒక్క పైసాకు బదులు రూ.38 చెల్లింపు

లడ్డూ రుచికరంగా ఉండేందుకు నాణ్యతలో రాజీ పడకుండా దిట్టం నుంచి సమపాళ్లలో ముడిసరుకులు అందిస్తున్నారు. 1 కిలో శనగ పిండికి 2 కిలోల చక్కర, 650 గ్రాముల నెయ్యి, 50 గ్రాముల కాజు, 50 గ్రాముల కిస్‌మిస్‌, 50 గ్రాముల మిస్రీ, ఏడున్నర తులాల యాలకులు, తులంన్నర జాజికాయ, తులంన్నర పచ్చ కర్పూరం అందిస్తున్నారు. కిలో శనగపిండి ప్రాతిపదికన 100 గ్రాముల లడ్డూలు 42, 400 గ్రాముల లడ్డూలు 11 తయారుచేసి ఇవ్వాలి. అందుకు 100 గ్రాముల లడ్డూను కిలోమేర తయారు చేయించి ఇచ్చినందుకు రూ.38, అలాగే 400 గ్రాముల పరిమాణం గల అభిషేకం లడ్డూ తయారీకి కేవలం ఒక్కపైసా చొప్పున చెల్లించాల్సి ఉన్నది. కానీ రెండు రకాల లడ్డూల తయారీ లేబర్‌ చార్జీలలో భారీగా తేడా ఉండటంతో టెండర్‌ దారుడు అభిషేకం లడ్డూలు విస్మరించి 400 గ్రాముల లడ్డూ బదులు 100 గ్రాముల పరిమాణం గల నాలుగు లడ్డూలు అందజేస్తున్నారు.

నిత్యం వేలాది లడ్డూల విక్రయం

మల్లన్న దర్శనార్థం సాధారణ రోజుల్లో నిత్యం 3-5 వేలు, ఆదివారం రోజున 10-15 వేల మంది వస్తున్నారు. అలాగే జాతర సమయంలో నిత్యం 5-10 మంది, ఆదివారాలలో 30-50 వేలమంది వస్తున్నారు. తద్వారా నిత్యం 2-4 వేలు, ఆదివారం 8-10 వేలు లడ్డూలు, జాతర కాలం సాధారణ రోజుల్లో నిత్యం 5-8 వేలు, ఆది వారాలలో 15-25 వేల లడ్డూలు విక్రయమవుతున్నాయి. అభిషేకం లడ్డూల స్థానంలో సాధారణ లడ్డూలు అందిస్తుండటంతోపాటు లేబర్‌ చార్జీలు పైసాకు బదులు రూ.38చొప్పున అడ్డగోలుగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆలయానికి భారీ గండిపడుతున్నా ఆలయవర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.

చెల్లింపులపై దృష్టి పెడితే..

ఆర్జితసేవలు జరిపిన వారితో వీవీఐపీ దర్శన టికెట్లు తీసుకున్న వారెంతమంది.. వారికి ఎన్ని అభిషేకం లడ్డూల జారీచేశారన్న వివరాలు పొందుపరిచిన డీసీఆర్‌తో పాటు ప్రసాద తయారీదారుడికి చెల్లించే డబ్బుల వివరాలు పరిశీలిస్తే అసలు బాగోతం బయల్పడనున్నది. ఒక కిలోకు పైసా చెల్లించాల్సి ఉండగా, అభిషేకం లడ్డూ తయారు చేయకున్నా కిమ్మనకుండా వ్యవహరిస్తుండటం పట్ల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ ఆదాయ పరిరక్షణతో పాటు వనరులు పెంపొందిస్తున్నామని చెబుతున్న పునరుద్ధరణ కమిటీ అభిషేక లడ్డూ ప్రసాద విషయంలో జరుగుతున్న ‘చెల్లింపు’లపైనా దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:42 PM