Share News

అమృత ధారకు దుబ్బాక దూరం

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:59 PM

అధికారుల నిర్లక్ష్యమో, నాయకుల అలసత్వమో కానీ.. దుబ్బాకకు కేంద్ర మంచినీటి పథకం అమృత ధార అందని మావిగా మారింది. అమృత ధార మంచినీటి పథకాన్ని అతితక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దుబ్బాకను మొదటి, రెండు విడతల్లోనూ అమృత ధార పథకంలో చేర్చకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. దుబ్బాక పట్టణంలో కొత్త కాలనీలకు, కొత్త నిర్మాణాలకు మూడేళ్లుగా కనెక్షన్లు ఇవ్వలేదు. కొత్త కాలనీలకు కనెక్షన్లు ఇవ్వడానికి మిషన్‌భగీరథ నిర్వాహకులు ముందుకు రావడంలేదు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగిల్‌మోటర్ల మీదనే అధారపడాల్సిన దుస్థితి.

అమృత ధారకు దుబ్బాక దూరం
మినీట్యాంకు వద్ద నీటిని పట్టుకుంటున్న మహిళలు

దుబ్బాక, మార్చి 26: దుబ్బాక మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 40వేల మంది ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 5,885 మంచినీటి నల్లాలు ఉన్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా ఒక్క మనిషికి అవసరమయ్యే 135 లీటర్లను ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు దుబ్బాక జనాభా ప్రకారం సుమారు 4లక్షల 75 వేల లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది. కానీ కేవలం 3లక్షల 20 వేల లీటర్లను మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.

పాత ట్యాంకులే దిక్కు

దుబ్బాక మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ పథకం కింద కేవలం 13 నీటిట్యాంకులను మాత్రమే నిర్మించి చేతులు దులుపుకున్నారు. వాటి సామర్థ్యం సరిపోదని, మరో పది ట్యాంకులను నిర్మించాలని అధికారులు చెప్పినా వినకుండా అప్పటి ప్రభుత్వం పాతవాటినే కొనసాగించాలని సూచించింది. దీంతో దుబ్బాక మున్సిపాలిటీలోని సుమారు 20 పాత ట్యాంకులను వినియోగంలోకి తెచ్చారు. దుబ్బాకలో లక్షా 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును రెండుసార్లు మిషన్‌ భగీరథ ద్వారా నింపి రెండు ప్రాంతాలకు రెండుసార్లు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. చెల్లాపూర్‌లో 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును కూడా రెండుసార్లు నింపి, రెండు వైపులా పూటకోసారి విడుదల చేస్తున్నారు. దుంపలపల్లి, ధర్మాజీపేట వార్డుల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కాగా 2014కు ముందు నీటి నిర్వహణ గ్రామీణ నీటిపారుదల శాఖ పరిధిలో ఉండగా స్థానిక నీటివనరులను వినియోగించుకుని ట్యాంకులను నిర్మించారు. వాటిలో సగానికి పైగా పూర్తి సామర్థ్యం లేకపోవడం, పైపులైన్‌ వ్యవస్థ కూడా సాంకేతికంగా లేకపోవడంతో అవస్థలు తప్పడంలేదు.

నిషేధించినా.. సింగిల్‌ఫేజ్‌ మోటర్లే దిక్కు

గత ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం ప్రారంభించి, సింగిల్‌ఫేజ్‌ మోటర్ల వినియోగాన్ని నిషేధించింది. దుబ్బాకలో మాత్రం సుమారు 215 సింగిల్‌ఫేజ్‌ మోటర్లను వినియోగిస్తున్నారు. దీనివల్ల వచ్చే సుమారు రూ.5లక్షల కరెంటు బిల్లు మున్సిపాలిటీ భారంగా మారుతున్నది. కొన్ని చోట్ల నేరుగా 5హెచ్‌పీ మోటర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. చెల్లాపూర్‌ వార్డు అంబేడ్కర్‌ విగ్రహం వీధి, 2, 3వ వార్డుల్లో నేరుగా బోరుమోటర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ మిషన్‌ భగీరథ నీరు కూడా అందడం లేదు.

30ఏళ్ల ముందుచూపుతో అమృతధార

పట్టణాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువరేషన్‌ ట్రాన్‌ఫార్మేషన్‌ (అమృత్‌) ఫథకాన్ని 2015లో ప్రవేశపెట్టింది. అమృత ధార ద్వారా సుమారు రూ.53 కోట్ల వరకు ప్రతిపాదించుకునే అవకాశం ఉంటుంది. తగినన్నీ ట్యాంకుల నిర్మాణం చేపట్టి, నిరంతరం నీటి సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది. జనాభా నిష్పత్తి ప్రకారం 5శాతం చొప్పున గణించి, 30 ఏళ్ల వరకు జనాభాకు ఎంత సామర్థ్యం కలిగిన ట్యాంకులు అవసరమో ఇప్పుడే నిర్మించవచ్చు. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రాతినిధ్యం వహించినా ఈ పథకం కింద చేర్చలేదు. దుబ్బాక కంటే తక్కువ జనభా కలిగిన చేర్యాలను చేర్చడం విశేషం.

Updated Date - Mar 26 , 2024 | 11:59 PM