Share News

చేనుకు కంచె.. రైతుకు ప్రాణ సంకటం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:49 PM

కల్హేర్‌, మార్చి 24: నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. పంట దిగుబడిలో వచ్చే కొద్దిపాటి లాభం కోసం పంటకు రక్షణగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ కంచెలకు తగిలి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

చేనుకు కంచె.. రైతుకు ప్రాణ సంకటం

ప్రాణాలు తీస్తున్న విద్యుత్‌ కంచెలు, వారంరోజుల్లోనే ఇద్దరి మృతి

పశువుల మరణాలు అయితే లెక్కేలేదు

నివారణకు చర్యలు చేపట్టాలని రైతుల డిమాండ్‌

కల్హేర్‌, మార్చి 24: నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. పంట దిగుబడిలో వచ్చే కొద్దిపాటి లాభం కోసం పంటకు రక్షణగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ కంచెలకు తగిలి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలంలోని కొత్తచెరువు తండా శివారులో పోమ్యానాయక్‌తండాకు చెందిన ధరావత్‌ రాంసింగ్‌(38), సిర్గాపూర్‌ మండలంలోని ఖాజాపూర్‌లో అంతర్గాం జైపాల్‌(30) అనే యువకులు వారంరోజుల వ్యవధిలో విద్యుత్‌ కంచెలకు బలయ్యారు. 2001 జనవరిలో మండలంలోని మాసాన్‌పల్లికి చెందిన వల్లూరి శివశంకర్‌(10) అనే బాలుడు నేరేడు పండ్లకు వెళ్లి సమీపంలో నారుమడికి పెట్టిన విద్యుత్‌ కంచెకు తగిలి మృతిచెందాడు. అదేవిధంగా 2002లో మండలంలోని బాచేపల్లి షేకలికుంటాతండాకు చెందిన దిలీప్‌(45) మేత కోయడానికి వెళ్లి మొక్కజొన్న పంటకు పెట్టిన విద్యుత్‌ కంచెకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇవి తెలిసిన ఘటనలు తెలియనివి ఎన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

పట్టించుకోని అధికారులు

అడవి పందులు, కోతుల బారి నుంచి జొన్న, మొక్కజొన్న, వరి తదితర పంటలను కాపాడుకోవడానికి పంట చుట్టూ విద్యుత్‌ తీగలతో కంచె ఏర్పాటు చేసి రాత్రి పూట విద్యుత్‌ సరఫరా చేస్తారు. అలెర్ట్‌గా ఉన్నవారు తెల్లవారు జామునే వెళ్లి విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారు. కొందరు అక్కడికి ఎవరు వస్తారులే అని విద్యుత్‌ సరఫరాను నిలిపివేయకపోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రమైన కల్హేర్‌లో కూడా పదిరోజుల క్రితం పశువుల కాపరులు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిసింది. ముందు కుక్క వెళ్లడంతో కంచెకు తగిలి కుక్క బలికాగా.. వారు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విద్యుత్‌ కంచెలకు తాగి మృత్యువాత పడిన పశువుల లెక్కేలేదు.

లాభం కంటే.. నష్టమే ఎక్కువ..

పంట రక్షణ కోసం విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసి పంటలు పండించే రైతులకు గతంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో వారు కంచెలు ఏర్పాటు చేయడమే మానేశారు. పంట దిగుబడిలో వచ్చే లాభం కంటే.. ఇలాంటి ఘటనల వల్ల పడే ఇబ్బందులు ఎందుకని విద్యుత్‌ కంచెల ఏర్పాటు జోలికి పోవడం లేదు. ఈ కంచెలను జనసంచారం లేని గిరిజన తండాల్లోనే ఎక్కువశాతం ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వారికి ట్రాన్స్‌కో అధికారులు అవగాహన కల్పించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం: నారాయణ, ట్రాన్స్‌కో ఏఈ

మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పంటలకు విద్యుత్‌ కంచెలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించి నివారణకు ప్రయత్నం చేస్తాం. అయినా ఎవరైనా రైతులు కంచెలు ఏర్పాటు చేస్తే విద్యుత్‌ చౌర్యం కింద కేసులు నమోదు చేస్తాం. కంచెలు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు నిలిపేస్తాం.

Updated Date - Mar 24 , 2024 | 11:49 PM