Share News

గులాబీ తోటలో విరిసిన కమలం

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:11 AM

గులాబీ పార్టీకి కంచుకోటగా పేరున్న మెదక్‌లోక్‌సభలో బీజేపీ పాగా వేసింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎంపీగా విజయం సాధించారు. ఈ సీటు బీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరుతుందని అంతా భావించారు.

గులాబీ తోటలో విరిసిన కమలం

తొలిసారి ఎంపీగా రఘునందన్‌రావు గెలుపు

39,139 ఓట్ల మెజార్టీతో విజయం

రసవత్తరంగా తొలి ఐదు రౌండ్ల లెక్కింపు

ఆ తర్వాతే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం

అనూహ్యంగా కాంగ్రెస్‌కు రెండోస్థానం

మూడోస్థానంతో సరిపెట్టుకున్న బీఆర్‌ఎస్‌

ఇరవై సంవత్సరాల తర్వాత మెదక్‌లో మార్పు

ఆరునెలల్లోనే బీఆర్‌ఎస్‌కు ప్రతికూల తీర్పు

బీజేపీ, కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్లు

అందరి అంచనాలు తలకిందులు!!

ఆంధ్రజ్యోతి ప్రతినిధి,సిద్దిపేట, జూన్‌ 4 : గులాబీ పార్టీకి కంచుకోటగా పేరున్న మెదక్‌లోక్‌సభలో బీజేపీ పాగా వేసింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎంపీగా విజయం సాధించారు. ఈ సీటు బీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరుతుందని అంతా భావించారు. కానీ అనూహ్య రీతిలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇక్కడ ‘కమలం’ వికసించింది. పైగా బీఆర్‌ఎస్‌ పార్టీకి మూడోస్థానం దక్కడం గమనార్హం. కాంగ్రెస్‌ రెండోస్థానానికి ఎగబాకింది. తొలి పదిరౌండ్లలో ఫలితాలు స్వల్ప తేడాలతో ఉత్కంఠను రేకెత్తించగా.. ఆ తర్వాత బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చాయి. 2004 నుండి 2019 పార్లమెంటు ఎన్నికల వరకు తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న గులాబీ శ్రేణులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరవై ఏళ్ల ఆధిపత్యానికి ఎట్టకేలకు బ్రేక్‌ పడింది.

రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరిగినా అందరిచూపు మాత్రం మెదక్‌ సెగ్మెంటు వైపే ఉందంటే అతిశయోక్తి కాదు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎ్‌సకు చావోరేవో అన్నట్లుగా మారిన ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అందులో మెదక్‌ మొదటిది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేలుగా ఉన్న గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలు ఈ లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి. పైగా ప్రచారం నుంచి ఎగ్జిట్‌పోల్స్‌ వరకు బీఆర్‌ఎ్‌సకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా మెదక్‌లో విజయం దక్కుతుందనే ధీమా ఉండేది. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందడమే కాకుండా బీఆర్‌ఎస్‌ మూడోస్థానానికి పడిపోయింది.

ఉత్కంఠ నుంచి ఆధిక్యం దాకా..

మెదక్‌ లోక్‌సభ ఫలితాలపై ఆది నుండి ఉత్కంఠ నెలకొంది. ఇందుకు తగినట్లుగానే మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి 1542 ఓట్ల ఆధిక్యం రాగా, 2వ రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు 355 ఓట్లు వచ్చాయి. 3వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 1731 ఓట్ల ఆధిక్యం దక్కడంతో ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఆ తర్వాత 4, 5 రౌండ్లలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చగా 6వ రౌండ్‌లో మళ్లీ బీజేపీ ముందంజ వేసింది. ఇక 7వ రౌండ్‌ నుంచి రఘునందన్‌రావు ఆధిక్యం పెరుగుతూ వెళ్లింది. అయితే మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు రౌండ్‌రౌండ్‌కూ తన ఓట్లను పెంచుకుంటూ రెండోస్థానానికి చేరారు. చివరగా 23 రౌండ్లు ముగిసేదాకా బీజేపీకి ఎదురులేకుండా పోయింది. నువ్వానేనా అన్నట్లుగా ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి నడుమ 74వేల ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు 39వేల ఓట్ల తేడా రావడంతో ఇక బీజేపీకి లైన్‌క్లియర్‌ అయ్యింది.

మెదక్‌లో రెండోసారి బీజేపీ

మెదక్‌ లోక్‌సభకు సంబంధించి ఇప్పటివరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ఉన్నారు. ఇక పీడీఎఫ్‌, టీడీపీ, టీపీఎస్‌ పార్టీల అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. ఐదుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు విజయం దక్కింది. ఇందులో మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా ఉన్నారు. అయితే 1999లో బీజేపీ తరపున ఆలె నరేంద్ర బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నప్పటికీ ప్రభావం చూపించలేకపోయారు. తాజా ఎన్నికల్లో రఘునందన్‌రావు గెలుపొందడంతో మెదక్‌పై మళ్లీ పట్టు సాధించారు.

నాటి ఎమ్మెల్యే నేడు ఎంపీ... నేటి ఎమ్మెల్యే నాడు ఎంపీ

దుబ్బాక : దుబ్బాకలో విచిత్రమైన రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మూడేళ్లు దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగిన రఘునందన్‌రావు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ నుంచి మెదక్‌పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ప్రస్తుతం గెలుపొందారు. ఇదేస్థానం నుంచి పదేళ్లపాటు ఎంపీగా కొనసాగిన కొత్తప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. యాదృచ్ఛికంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి స్థానంలో రఘునందన్‌రావు గెలుపొందడం గమనార్హం. ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ ఏడు అసెంబ్లీలకు ప్రతినిధిగా ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్వరాష్ట్రంలో జరిగిన మూడు ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గవాస్తవ్యులే మూడుసార్లు పార్లమెంట్‌ స్థానాలకు గెలుపొందడం విశేషం.

‘హస్తానికి’ జై కొట్టిన మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులు

గజ్వేల్‌, జూన్‌ 4: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలోని మల్లన్నసాగర్‌ నిర్వాసితులు కాంగ్రె్‌సకు జైకొట్టారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన నిర్వాసితులు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వైపు నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం, స్ధానిక నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై దృష్టిసారించి మొత్తంగా ఓట్లు రాబట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 3,163 ఓట్లు రాగా, బీజేపీకి 1,976, బీఆర్‌ఎస్‌కు 2,584 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌పై భూనిర్వాసితులు తమ డిమాండ్లకు సంబంధించిన అల్టీమేటాన్ని ఓట్లతో అందజేసినట్లు అయింది.

Updated Date - Jun 05 , 2024 | 12:11 AM