Share News

సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్‌ పదవులు

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:58 PM

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవుల్లో సంగారెడ్డి జిల్లాకు ప్రాముఖ్యత దక్కింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు మూడు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి.

సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్‌ పదవులు

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యం

సంగారెడ్డి టౌన్‌, మార్చి 17: రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవుల్లో సంగారెడ్డి జిల్లాకు ప్రాముఖ్యత దక్కింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు మూడు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్‌పర్సన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి టి.నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పటాన్‌చెరుకు చెందిన ఎంఏ ఫహీం, చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన గిరిధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేని మూడు నియోజకవర్గాలకు పదవులు దక్కడంపై కాంగ్రెస్‌ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

టి.నిర్మలారెడ్డికి కీలక కార్పొరేషన్‌

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్‌పర్సన్‌గా టి.నిర్మలా జగ్గారెడ్డి నియామకమయ్యారు. నిర్మాలారెడ్డి ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు. ప్రభుత్వ హెడ్‌నర్సు ఉద్యోగానికి 2005లో రాజీనామా చేసిన ఆమె 2014లో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండేళ్లుగా సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించారు.

విధేయతకు పట్టం

పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల్లో పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌కు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి, పీసీసీ ప్రొటోకాల్‌ వైస్‌చైర్మన్‌ ఎంఏ ఫహీంకు కీలకమైన పదవి దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్న బృందంలో సభ్యుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. దీనికి గుర్తింపుగా ఆయనను ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. టీడీపీ విద్యార్థి నాయకుడిగా ఎంఏ ఫహీం 2004లో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2006లో టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రె్‌సలో చేరి పీసీసీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా కీలకమైన హోదాల్లో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ కమ్యూనికేషన్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్‌జోడో యాత్ర ఏర్పాట్లలో చురుగ్గా వ్యవహరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వీరవిధేయుడుగా ఆయనకు పేరున్నది. ఆదివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

జహీ రాబాద్‌కు రాష్ట్రస్థాయి పదవి

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ హాయాంలో జహీరాబాద్‌ ప్రాంతానికి మరోసారి రాష్ట్రస్థాయి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన ఎంపీపీ గిరిధర్‌రెడ్డిని నియమించారు. జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లికి చెందిన గిరిధర్‌రెడ్డి 2018-19లో ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు నుంచే ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మున్సిపల్‌శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన సమీప బంధువు. ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎన్నికైన గిరిధర్‌రెడ్డిని ఆదివారం జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌లో కలిసి సన్మానించారు.

Updated Date - Mar 18 , 2024 | 12:02 AM