Share News

ప్రజలు మెచ్చుకునేలా పని చేయాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:48 PM

అధికారులు తమ శాఖల పని తీరును మెరుగుపరుచుకుని ప్రజలు మెచ్చుకునేలా పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా అధికారులు విధులు నిర్వహించాలన్నారు.

ప్రజలు మెచ్చుకునేలా పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

అధికారులతో సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా, జనవరి 17: అధికారులు తమ శాఖల పని తీరును మెరుగుపరుచుకుని ప్రజలు మెచ్చుకునేలా పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. బుధవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలో ప్రభుత్వ శాఖలపై మంత్రి కలెక్టరేట్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లలో అనుకున్న ప్రగతి సాధించలేదన్నారు. అన్ని రంగాల్లో పురోగతి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వ పాలన జరగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసలుకోవాలని హితవు పలికారు. అంతిమంగా ప్రజల చేత శభాష్‌ అనిపించుకునేలా అధికారుల పనితీరు ఉండాలని ఆయన సూచించారు.

వేసవిలో తాగునీటి ఇక్కట్లు లేకుండా చూడాలి

మిషన్‌ భగీరథపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. అధికారులు ఇస్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొంతన లేదని సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని తెలిపారు. మరో పది రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, వాస్తవిక నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మైన్స్‌ ఆదాయంపై నివేదిక ఇవ్వాలి

రెవెన్యూ అంశాలపై చర్చ సందర్భందా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ నివేదికను వినిపించారు. ధరణిలో ఇప్పటి వరకు 26,900 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 23వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మరో 3500 దరఖాస్తులు ఆయా కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. స్పందించిన మంత్రి జూపల్లి ఇప్పటి వరకు కబ్జా అయిన భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గనులు, భూగర్భశాఖకు సంబంధించి జిల్లాలో ఎన్ని మైన్స్‌లు ఉన్నాయి?, వాటికి సంబంధించిన ఖనిజాలు ఎక్కడ వినియోగించారు?, వచ్చిన ఆదాయం ఎంత?, ఎక్కడ వినియోగించారు అనే పూర్తి నివేదికను తయారు చేయాలన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్ని రకాల పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మారిందని, కొన్ని శాఖల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటాలు ఉన్నాయని, వాటిని మార్చల్సిందిగా సూచించారు. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల నుంచి కుడి కాలువ ద్వారా యధావిధిగా నీరు పారుతుందని, ఎడమ కాలువకు మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో ప్రస్తుత పంటకు కనీసం రెండు తడులకు సాగునీరు అందించేలా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. అందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, తిరుపతిరావు, అడిషనల్‌ ఎస్పీ తేజావత్‌ రాందాస్‌, ఆర్డీవో పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 10:48 PM