సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:49 PM
గ్రామపంచాయితీల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- 255 గ్రామాలకు 101 మంది ప్రత్యేకాధికారులు
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 6 : గ్రామపంచాయితీల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు హాలులో గద్వాల, అలంపూర్ నియోజక వర్గాల ప్రత్యేక అఽధికారులు, పంచాయితీ కార్యదర్శులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచుల పదవీకాలం ముగిసినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లోని 255 గ్రామ పంచాయితీలకు 101 మంది మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల రెండవ తేదీన వీరు బాధ్యతలు స్వీకరించారన్నారు. ఈ నెల ఏడు నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన పంచాయితీరాజ్ చట్టాలపై ప్రత్యేక అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధులు లేని లోటు కనపడకుండా, పంచాయితీ కార్యదర్శులు సమన్వయంతో వ్యవహరిసూత ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామపంచాయితీల్లో నిర్వహించనున్న పారిశుధ్యం పనులను పర్యవేక్షించాలని సూచించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించాలని, ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల నిర్వహణపై దృష్టి సారించాలని, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు నెలలకోసారి నిర్వహించే గ్రామ సభలకు ప్రత్యేక అధికారులు అధ్యక్షత వహించాలని చెప్పారు. అదాయ వ్యయాలపై సమీక్షించాలని, గ్రామాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఈనెల 28 వరకు ఇంటి పన్నులు వంద శాతం వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్, చీర్ల శ్రీనివాస్, జిల్లా పంచాయితీ అధికారి శ్యామ్‌సుందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉమాదేవి, జడ్పీ సీఈవో కాంతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.