Share News

సొంత జిల్లాలో పంతం నెగ్గేనా

ABN , Publish Date - May 15 , 2024 | 10:45 PM

పార్లమెంట్‌ ఎన్నికలు రాష్ట్రంలో హోరాహోరీగా సాగాయి. పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడటమే మిగిలింది. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి పాలమూరు పార్లమెంట్‌ స్థానాల్లో పోరును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఎక్కువ శ్రద్ధ చూపాయి.

సొంత జిల్లాలో పంతం నెగ్గేనా
నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (ఫైల్‌)

పాలమూరు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

వంశీచంద్‌రెడ్డి గెలుపు కోసం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పది సార్లు పర్యటన

మహబూబ్‌నగర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పార్లమెంట్‌ ఎన్నికలు రాష్ట్రంలో హోరాహోరీగా సాగాయి. పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడటమే మిగిలింది. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి పాలమూరు పార్లమెంట్‌ స్థానాల్లో పోరును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఎక్కువ శ్రద్ధ చూపాయి. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను 12 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకున్నది. అదే ఊపును ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో చూపి సొంత జిల్లాలో తన పంతం నెగ్గించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. అందుకే మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా పది సార్లు పర్యటించారు. ‘‘ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోలేకపోతున్నారు, ఇక్కడి బిడ్డకు సీఎం అయ్యే అర్హత లేదా? ఇక్కడి ప్రజల బాధలు నాకే ఎక్కువ తెలుసు’’ అనే అంశాలను బలంగా తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తున్నారని, పాలమూరు బిడ్డను తాకితే కరెంటు షాక్‌ తగులుతుందనే విషయాన్ని నిరూపించాలని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయనే విషయాలను కూడా పదేపదే ప్రస్తావించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు అంటారని, అందుకే పాలమూరులో రెండు స్థానాలను గెలిపించి, తనకు బలం ఇవ్వాలని సీఎం అన్ని సందర్భాల్లో ప్రజలను కోరారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీఓ 69 పథకాన్ని రీడిజైన్‌ చేసి 1.30 లక్షల ఎకరాకు నీరందించే మక్తల్‌- నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్నికలకు ముందే శంకుస్థాపన చేసి పనుల ప్రక్రియను ప్రారంభించారు. మక్తల్‌ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే సంగంబండ రిజర్వాయర్‌ వద్ద బండను పగులగొట్టే ప్రక్రియ ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటే రూ. 10 కోట్లు మంజూరు చేశారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నప్పటికీ ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు, అభ్యర్థికి సూచనలు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాలను తన పర్యటనలో కవర్‌ చేసిన ముఖ్యమంత్రి.. తనకు ఇక్కడ గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోనే నాలుగుసార్లు ఆయన పర్యటించగా దేవరకద్రలో కొంత ఇబ్బంది ఉన్నదన్న సూచనల మేరకు కొత్తకోట పట్టణంలో కార్నర్‌ మీటింగ్‌, మక్తల్‌, నారాయణపేటలలో జనజాతర సభ, మహబూబ్‌నగర్‌లో ఒక కార్నర్‌ మీటింగ్‌, జన జాతర సభ, షాద్‌నగర్‌లో కార్నర్‌ మీటింగ్‌కు రేవంత్‌ హాజరయ్యారు.

చేరికలకు ప్రోత్సాహం...

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో చేరికలను ఎక్కువగా ప్రోత్సహించింది. బీజేపీని దెబ్బకొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ సీనియర్‌ లీడర్‌ అయిన ఏపీ జితేందర్‌రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత మక్తల్‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీచేసి, జితేందర్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న ఎం. జలంధర్‌రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కోస్గి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీలను కాంగ్రెస్‌ హస్తగతం చేసుకున్నది. వీరేకాకుండా పలువురు బీఆర్‌ఎస్‌ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో ఏ చిన్నలీడర్‌ను కూడా వదలకుండా పార్టీ కండువా కప్పుకున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జడ్పీ చైర్‌పర్సన్‌లను కూడా పార్టీలో చేర్చుకున్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్‌ చైర్మన్లను నియోజకవర్గానికి ఒకరిని ఇన్‌చార్జిగా నియమించుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు కో ఆర్డినేషన్‌ కోసం నియమించారు. నిత్యం వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ ఇంటలిజెన్స్‌, పార్టీ సర్వేలను అంచనాలను వేసుకొని సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు. మరోవైపు ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కూడా ఇది తన ఎన్నిక మాత్రమే కాదని, పాలమూరు ప్రజలను గెలిపించుకునే ఎన్నిక అని, రేవంత్‌రెడ్డికి కొండంత అండగా నిలిచే ఎన్నిక అని ప్రచారం చేశారు. బీజేపీ బలంగా ఉన్నదన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్‌ఎస్‌ పార్టీపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఓట్ల చీలిక జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీ ప్రచార సరళిని కొనసాగించారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓట్ల పోలరైజేషన్‌ కోసం పార్టీ కేడర్‌ను పూర్తిగా గ్రామాలు, గల్లీల్లోకి దింపారు. 20 ఓట్లకు ఒక కార్యకర్త చొప్పున నియమించి పోలరైజేషన్‌ను పెంచారు.

నాగర్‌కర్నూల్‌లో రెండుసార్లు ప్రచారం

మహబూబ్‌నగర్‌తో పోల్చితే నాగర్‌కర్నూలులో సీఎం రేవంత్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే పర్యటించారు. ఒకసారి రాహుల్‌గాంధీ సభలో పాల్గొనగా అంతకుముందు బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌తో పోల్చితే నాగర్‌కర్నూలులో గెలుపు సులభమేననే అంచనాల మేరకు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌పై ఎక్కువగా దృష్టి సారించారని చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అంచనాల ప్రకారం ఈ రెండు స్థానాల్లో గెలుస్తామని ధీమాతో నాయకులు ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని ఓడించడం ద్వారా ఆయనను కొంత వీక్‌ చేయవచ్చని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎత్తుగడలు వేశాయి. సీఎం విమర్శలతో పాటు పాలమూరు ఆడబిడ్డను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని, అవమానిస్తున్నారని డీకే అరుణ కూడా సెంటిమెంట్‌ అస్ర్తాన్ని ప్రయోగించారు. సొంత జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకొని సీఎం తన పంతం నెగ్గించుకుంటారా, లేక బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించే ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది వేచిచూడాలి.

Updated Date - May 15 , 2024 | 10:45 PM