Share News

మహిళా సంఘం నిధులు పక్కదారి

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:49 PM

గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టాయి. ఐదేళ్లుగా లెక్కలు చెప్పకపోవడంతో మహిళా సంఘాల సభ్యులకు అనుమానం వచ్చింది. బుక్‌కీపర్‌ నర్సింహులును అడిగితే సీసీ రంగన్నను అడగండని చెప్పగా, ఆయన్ను అడిగితే బుక్‌కీపర్‌ మీదకు నెట్టడంతో మహిళల్లో అనుమానాలు పెరిగిపోయాయి.

మహిళా సంఘం నిధులు పక్కదారి
ఏపీఎంతో వాగ్వాదానికి దిగిన మహిళలు

ఐదేళ్లుగా లెక్కలు చెప్పని బుక్‌ కీపర్‌

గద్వాల మండల సమాఖ్య వద్ద మహిళల నిరసన

మా డబ్బులు ఇవ్వాలని ఏపీఎంతో వాగ్వాదం

నాలుగు రోజుల్లో లెక్కలు చెబుతామని సమాధానం

గద్వాల, మే 10: గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టాయి. ఐదేళ్లుగా లెక్కలు చెప్పకపోవడంతో మహిళా సంఘాల సభ్యులకు అనుమానం వచ్చింది. బుక్‌కీపర్‌ నర్సింహులును అడిగితే సీసీ రంగన్నను అడగండని చెప్పగా, ఆయన్ను అడిగితే బుక్‌కీపర్‌ మీదకు నెట్టడంతో మహిళల్లో అనుమానాలు పెరిగిపోయాయి. ఐదేళ్ల క్రితం రూ.15.80 లక్షల జమతో లెక్కలు చెప్పి, పాత కమిటీ దిగిపోయింది. ఇప్పుడు దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండాలని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. కానీ బ్యాంకులో అంతడబ్బు లేదని, పక్కదారి పట్టిందని ఆరోపిస్తూ సోమవారం 100 మందికి పైగా మహిళలు మండల మహిళా సమాఖ్యకు చేరుకున్నారు. ఈ విషయమై ఏపీఎం పారిజాతతో వాగ్వాదానికి దిగారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఆమె చాంబర్‌ ముందు కూర్చొని నిరసన తెలిపారు.

అనుమానాలు ఇవే..

ఐదేళ్ల క్రితం పాత కమిటీ రూ.15.80 లక్షలను కొత్త కమిటీకి అప్పగించింది. కొత్త కమిటీ ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదు. అదే విదంగా ఐదేళ్లుగా వానాకాలం, యాసంగిలో కొనుగోలు కేంద్రాల నిర్వాహణ ద్వారా రూ.12 లక్షల కమీషన్‌ వచ్చింది. వాటికీ లెక్కలు లేవు. అందులో నుంచి రూ.4.60 లక్షలు డ్రా చేశారని, వాటిని ఎందుకు ఖర్చు చేశారో చెప్పలేదని ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహణ కోసం అధికంగా ఖర్చయ్యిందని రాసి, డ్రా చేశారని సమాచారం. గామ్రంలో 40 చిన్న సంఘాలు ఉన్నాయి. దాంతో మరో గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేయాలని అడుగగా ఒప్పుకోకపోవడం, ఉన్న గ్రామ సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి నిరాకరించడం, బుక్‌ కీపర్‌ పొంతనలేని సమాధానాలు, వింత వాదనలు వినిపిస్తుండటం, గత ఏపీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో డబ్బలు పక్కదారి పట్టాయనడానికి బలం చేకూరుతోందని అంటున్నారు.

ఏపీఎం హామీతో విరమణ

డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ఏపీఎం పారిజాత వచ్చి నాలుగు రోజుల్లో లెక్కలు చెబుతామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. ఐదేళ్ల లెక్కలు చేస్తామని, ఒక్క రూపాయి కూడా మహిళల డబ్బులు పక్కదారి పట్టదనే గ్యారంటీ ఇవ్వడంతో శాంతించారు. ఈ విషయమై ఏపీఎం పారిజాతను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గ్రామ సమాఖ్యలో మహిళా సంఘాల పొదుపులు రూ.8.56 లక్షలు, ధాన్యం కమీషన్‌ రూ.6 లక్షలు బ్యాంకులో ఉన్నాయన్నారు. మరో రూ.8.60 లక్షలు అప్పులు ఇచ్చారని తెలిపారు. మహిళలు అనుమానిస్తున్నట్లు పక్కదారి పట్టలేదని, బుక్‌కీపర్‌ లెక్కలు చెప్పకపోవడమే ప్రధాన సమస్య అని వివరించారు.

Updated Date - Jun 10 , 2024 | 10:49 PM