Share News

పురుగు మందు డబ్బాతో.. రైతుల ఆందోళన

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:06 PM

భారత మాల రహదారిలో భూములు కోల్పోయిన అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగారు.

పురుగు మందు డబ్బాతో.. రైతుల ఆందోళన
పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగిన రైతులు

పనులను ఆపడానికి వీల్లేదన్న భారతమాల ఉద్యోగి

బావులు, బోర్లకు పరిహారం ఇవ్వలేదన్న బాధితులు

అయిజ, మార్చి 12: భారత మాల రహదారిలో భూములు కోల్పోయిన అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. రహదారిపైకి చేరుకుని పనులను అడ్డుకున్నారు. భారత మాల ఉద్యోగి అక్కడకు చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోయిన తమకు ఎకరాకు రూ.4.60 లక్షలు మాత్రమే అందచేశారని, భూముల్లో ఉన్న మోటార్లు, బావులు, పైపులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. అందుకు సదరు ఉద్యోగి మీకు పరిహారం ఇచ్చినట్లు, మేము పనులు చేసుకోవాలని అధికారులు లెటర్లు ఇచ్చారని, పనులను ఆపడానికి మీకు హక్కు లేదని చెప్పారు. మీకు ఇంకా పరిహారం ఇవ్వడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. తమకు మోటార్లు, బావులు, పైపులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. తాము అధికారులనే నమ్ముకున్నామని, వారే కాదంటే తమకు చావే గతి అని అన్నారు. రహదారికి అడ్డంగా పడుకుంటామని, తమపై వాహనాలు ఎక్కించి చంపండని వాపోయారు. దాంతో ఉద్యోగి పనులను నిలిపేసి, వెనుదిరిగి పోయారు.

Updated Date - Mar 12 , 2024 | 11:06 PM