మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు
ABN , Publish Date - Sep 05 , 2024 | 11:18 PM
తెలంగాణాలో మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకని.. రోజుకో రేప్, గంటకో అఘాయిత్యం ఇదేనా మార్పు అని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- రోజుకో రేప్, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు
- బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి
- తక్షణమే నిందితుడిని అరెస్టు చేయాలి
- తెలంగాణ చౌరస్తాలో బీజేపీ మహిళా మోర్చా నిరసన
మహబూబ్‌నగర్(క్లాక్‌టవర్), సెప్టెంబరు 5 : తెలంగాణాలో మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకని.. రోజుకో రేప్, గంటకో అఘాయిత్యం ఇదేనా మార్పు అని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి ఆడబిడ్డపై ఆగస్టు 31న జరిగినటువంటి అత్యాచారం, ఆపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపుమేరకు గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికార మెందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మహిళపై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా ప్రభుత్వం పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. తక్షణమే నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఉరిశిక్ష విధించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయశ్రీ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యాదయ్య, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గోవింద్‌నాయక్, మహిళామోర్చా నాయకురాలు బాలకృష్ణమ్మ, వెంకటేశ్వరమ్మ, లక్ష్మి, వివిధ మండలాల మహిళా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.