Share News

మెనూ ఎందుకు అమలు చేయడం లేదు

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:03 PM

మధ్యాహ్న భోజనం మెనూను ఎందుకు అమలు చేయడం లేదని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ముషాయిదా బేగం వంట ఎజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెనూ ఎందుకు అమలు చేయడం లేదు
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో ముషాయిదా బేగం

- జడ్పీ డిప్యూటీ సీఈవో ముషాయిదా బేగం ఆగ్రహం

- మానవపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తనిఖీ

మానవపాడు, జనవరి 9 : మధ్యాహ్న భోజనం మెనూను ఎందుకు అమలు చేయడం లేదని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ముషాయిదా బేగం వంట ఎజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం అన్నం, సాంబర్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ చేయాల్సి ఉండగా, అన్నం, టమాట చారు మాత్రమే వండారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల నుంచి విద్యార్థులకు గుడ్లు కూడా ఇవ్వడం లేదని, సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నా మెనూ నిర్వహించడంలో నిర్లక్ష్యం ఎందు కని మండిపడ్డారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణరావు, సీడీపీవో సుజాత, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఇష్టంగా చదువుకోవాలి

విద్యార్థులు కష్టంతో కాకుండా, ఇష్టంగా చదువుకోవాలని, హక్కుల గురించి తెలుసుకుని ముందుకు సాగాలని జడ్పీ డీప్యూటీ సీఈవో ముషాయిదా బేగం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళశారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలలకు జీవించే, రక్షణ పొందే, అభివృద్ధి చెందే, భాగస్వామ్య హక్కులను తెలుసుకోవాలని సూచించారు. బాలికలకు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి ప్రస్తావన తలెత్తకూడదన్నారు. పిల్లలు వేధింపులకు గురైతే బాధ్యులపై కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కులకు విఘాతం కలిగితే 1098, 100 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, సీడీపీవో సుజాత, ఎస్‌ఐ రాము, బాలల పరిరక్షణ అధికారి రవి, హెచ్‌ఎం చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:03 PM