Share News

ఎత్తు పెంచేదెన్నడు?

ABN , Publish Date - May 21 , 2024 | 11:06 PM

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం కరకట్ట ఎత్తు పెంపునకు నోచుకోవడం లేదు.

ఎత్తు పెంచేదెన్నడు?
సుంకేసుల జలాశయం వద్ద ఎత్తు పెంచాల్సిన కరకట్ట

- 2009లో వరదలకు కొట్టుకుపోయిన కరకట్ట

- ఆ తర్వాత తక్కువ ఎత్తుతో కట్ట నిర్మాణం

- తుంగభద్రకు వరద పోటెత్తితే తెగిపోయే ప్రమాదం

రాజోలి, మే 21 : తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం కరకట్ట ఎత్తు పెంపునకు నోచుకోవడం లేదు. గతంలో ఉన్న కరకట్ట 2009 అక్టోబర్‌ రెండున వచ్చిన వరదలతో కొట్టుకుపోయింది. దీంతో జలాశయంలోని నీరు రాజోలిని ముంచెత్తి స్థానికులను నిరాశ్రయులను చేసింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపధికన కొత్త కరకట్టను నిర్మించింది. అయితే సుంకేసుల డ్యాంకు 34 గేట్లు మాత్రమే ఉన్నాయి. స్థాయికి మించి వరద నీరు వస్తే కట్ట మళ్లీ తెగిపోయే అవకాశం ఉందని, అందుకోసం గేట్లు పెంచాలన్న ఉద్దేశతంతో రెండున్నర మీటర్ల తక్కువ ఎత్తుతో కరకట్ట ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ప్రజలు దీనిని వ్యతిరేకించినా ప్రజా ప్రతినిధులు వారికి నచ్చచెప్పి పనులను పూర్తి చేయించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కరకట్ట ఎత్తు పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామ ర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, నదిలో పూడిక పేరుకు పోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఎగువనున్న కర్ణా టక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తే ఈ డ్యాంకు వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో డ్యాం గేట్ల ఆపరేటర్లు అప్రమత్తంగా లేకపోతే కరకట్ట తెగిపోయి నది తీర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది.

ఆందోళనకు గురవుతున్న ప్రజలు

కరకట్ట ఎత్తును పెంచకపోవడంతో ప్రజలు ఆందోళ నకు గురవుతున్నారు. దాదాపు 14 ఏళ్లుగా దీనికి సంబం ధించిన పనులు చేపట్టడం లేదు. జలాశయంలో నీరు నిండుగా ఉన్నప్పుడు, ఎగువ నుంచి భారీగా వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నదికి భారీగా వరద వస్తే, కరకట్ట దెబ్బతిని గ్రామాలు మునిగిపోయే ప్రమాద ముందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో పనులు చేపట్టేందుకు అనువుగా ఉంటుందని, ఆ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరకట్ట ఎత్తు పెంపునకు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అధ్వానంగా డ్యాం రహదారి

నిత్యం వాహనాల రాకపోకలు, తరచూ పర్యాటకుల సందడి ఉండే సుంకేసుల డ్యాం రహదారి అధ్వానంగా మారింది. 2009లో కరకట్ట కొట్టుకుపోవడంతో నిర్మించిన మట్టికట్ట నీటి ఊటకు కుంగిపోవడంతో దారి అధ్వానంగా మారింది. దీంతో డ్యాం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఉన్న కరకట్ట మీదుగా ఉన్న రోడ్డు గుంతలమయం అయ్యింది. కరకట్ట దిగువన కోతకు గురై ప్రమాదకరంగా మారింది. డ్యాంకు రక్షణ దిమ్మెలు లేకపోవడంతో, సందర్శకులు నేరుగా నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదముంది. ప్రమాదకరమైన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు.

ప్రతిపాదనలు పంపించాం

వరదల అనంతరం ఏర్పాటు చేసిన కరకట్ట తక్కువ ఎత్తులో ఉన్నది వాస్తవమే. ఆనకట్ట వద్ద ప్రమాదాలు జరగకుండా మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. డ్యాం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను గతంలోనే ఉన్నతాధికారులకు పం పించాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కరకట్ట ఎత్తు పెంపునకు చర్యలు తీసుకుంటాం.

- రాజు, జేఈ, సుంకేసుల డ్యాం

Updated Date - May 21 , 2024 | 11:07 PM