Share News

తుమ్మిళ్ల రిజర్వాయర్లను పూర్తి చేస్తాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:16 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తుమ్మిళ్ల రిజర్వాయర్లను పూర్తి చేస్తాం
అలంపూర్‌ రోడ్‌ షోలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- అలంపూర్‌, ఉండవల్లిలలో ప్రచారం

అలంపూర్‌/ ఉండవల్లి, ఏప్రిల్‌ 25 : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలం పూర్‌, ఉండవల్లి మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా వారికి చైర్మన్‌ చిన్నకృష్ణయ్య నాయుడు, ఈవో పురేందర్‌కుమార్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, శేషవస్త్రాలు అందించి సత్కరించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌ పార్టీకీ మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్‌ వస్తే కరెంటు రాదని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందవని మాజీ సీఎం కేసీఆర్‌ అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలంపూర్‌ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తుమ్మిళ్ల లిప్టుకు సంబంధించిన మూడు రిజర్వాయర్లను పూర్తి చేసి 81,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గొప్ప మాటలు చెప్పిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఎంపీ రాములు ఏమీ చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డికి 24 గంటల చేదోడువాదోడుగా ఉన్న మల్లు రవి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంషాద్‌ ఇస్మాయిల్‌, ఎంపీపీ బేగంగోకారి, మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, నాయకులు పెద్దబాబు, మహేష్‌ గౌడ్‌, ఆర్‌ఎస్‌ ప్రసన్నకుమార్‌, బీసమ్మ, గోపాల్‌, నాగరాజు, వెంకట్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలి

కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయడం మనందరి బాధ్యతని నాగర్‌కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లురవి అన్నారు. అలంపూర్‌ పట్టణంలో గురువారం మంత్రి జూపల్లి రోడ్‌ షో అనంతరం హరిత టూరిజంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో చర్చించి మూడు రిజర్వాయర్లను పూర్తిచేసే బాధ్యత తనదేనన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ సీఎం కేసీఆర్‌లు కవల పిల్లల్లాంటి వంటి వారన్నారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించామని, త్వరలో బీజేపీని కూడా గద్దె దించుతామన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆయన వద్దకే చేరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలిచాడని, ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీగా తాను గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ. 100 కోట్లతో అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:16 PM