Share News

వేతన సవరణ జీవో అమలు చేయాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:05 PM

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వేతన సవరణ జీవో అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియ న్‌ రాష్ట్ర కార్యదర్శి పీ సురేష్‌ విజ్ఞప్తి చేశారు.

వేతన సవరణ జీవో అమలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌

- మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌

వనపర్తి వైద్యవిభాగం, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వేతన సవరణ జీవో అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియ న్‌ రాష్ట్ర కార్యదర్శి పీ సురేష్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్‌, సెక్యూరిటీ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా కార్మికు లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లోని లక్షలాది మంది అసంఘటితరంగ కార్మికులు 12 సంవత్సరాలుగా వేతన సవరణకు నోచుకోకుం డా వెట్టి చాకిరి చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌కేర్‌, సెక్యూరిటీ, సూపర్‌వైజర్‌ కార్మికులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో వేతన సవరణ చట్టాలను పెండింగ్‌లో పెట్టి కార్మికుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. జీవో 21 అమలు అయితే పారిశుధ్య కార్మికులకు రూ. 20 వేలకు పైగా, సెక్యూరిటీ కార్మికులకు రూ. 24 వేలకు పైగా వేతనాలు అందుతాయన్నారు. అలాంటి జీవోలను అమలు చేయకుండా పీఆర్‌సీ జీవో 60 ప్రకారం ఆస్పత్రి కార్మికులకు వర్తింపజేసి టెండర్లను పిలిచి రూ. 15,600 చెల్లించి కాంట్రాక్టర్ల కు దోచి పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అనంతరం మెడికల్‌ కళాశాల బ్రాంచ్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుదాం

మదనాపురం : ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుదామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా కార్మిక రంగాలను వివక్ష చూపుతూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాబిన్నం చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరిగే గ్రామీణ బందును విజయవంతం చేయాలని ఆయన పిలపునిచ్చారు. కార్యక్రమంలో అమరచింత మునిసిపల్‌ చైర్మన్‌ జీఎస్‌ గోపి, మండల కార్యదర్శి వెంకట్రాములు ఉన్నారు.

అంగన్‌వాడీలకు పనిభారం తగ్గించాలి

వనపర్తి టౌన్‌ : అంగన్‌వాడీలకు పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంగన్‌వాడీ టీచర్లతో కలిసి డీడబ్ల్యూవో రామ మహేశ్వర్‌రెడ్డికి, సీడీపీవో సూపర్‌వైజర్‌ జ్యోతికి సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఐసీడీ ఎస్‌ను సంస్థగతం చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలోకి వెళుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శారద, జిల్లా కార్యదర్శి నారాయణమ్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:05 PM