వసూల్ రాజా
ABN , Publish Date - Apr 09 , 2024 | 10:51 PM
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 9: మీ మిల్లులకు ప్రభుత్వం నుంచి ధాన్యం ఇప్పిస్తానని, అయితే అందుకు అధికారులకు డబ్బులు ఇవ్వాలని జోగుళాంబ గద్వాల జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ సభ్యుడు, జిల్లా కేంద్రానికి చెందిన ఓ మిల్లు యజమాని ఇతర యజమానుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు.
మిల్లులకు ధాన్యం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన ఓ రైస్ మిల్లు యజమాని
ఒక్కో మిల్లర్ నుంచి రూ.50 వేల చొప్పున రూ.30 లక్షలు వరకు..
ధాన్యం కేటాయించకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుల డిమాండ్
ఆ పైసలు అధికారులకు ఇచ్చానంటున్న మిల్లర్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 9: మీ మిల్లులకు ప్రభుత్వం నుంచి ధాన్యం ఇప్పిస్తానని, అయితే అందుకు అధికారులకు డబ్బులు ఇవ్వాలని జోగుళాంబ గద్వాల జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ సభ్యుడు, జిల్లా కేంద్రానికి చెందిన ఓ మిల్లు యజమాని ఇతర యజమానుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. గత ప్రభుత్వ హయాంలో వానాకాలం సీజన్‌లో ఆ డబ్బులు వసూలు చేయగా మిల్లులకు ధాన్యం మాత్రం కేటాయించ లేదు. దాంతో డబ్బులు ఇవ్వాలని బాధితులు అతన్ని అడుగగా, డబ్బులు అధికారులకు ఇచ్చానని సమాధానమిచ్చాడు. దాంతో అటు ధాన్యం రాక.. ఇటు డబ్బులు కోల్పోయి బాధితులు లబోదిబోమంటున్నారు.
10 మిల్లులకే ధాన్యం
జిల్లాలో 65 రైస్ మిల్లులు ఉండగా వడ్ల కొరత కారణంగా గత వానాకాలంలో కేవలం 10 మిల్లులకు మాత్రమే వడ్లు వచ్చాయి. అది కూడా 10 లారీలలో 10 ఏసీకే వరకే వచ్చాయి. వానాకాలం వడ్లకు మంచి డిమాండ్ ఉండటంతో తమకూ ధాన్యం కావాలని మిగతా మిల్లర్లు అధికారులను కోరినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో ఉన్న ఓ మిల్లు యజమాని అధికారులకు డబ్బులు ఇస్తే మీ మిల్లులకూ వడ్లు వస్తాయని చెప్పాడు. ఇతర జిల్లాల నుంచి కూడా వడ్లు తెచ్చేలా ఏర్పాటు చేస్తానని నమ్మించాడు. ఒక్కో మిల్లు నుంచి రూ.50,000 నుంచి రూ.60,000 చొప్పున 50 మిల్లులకు గాను రూ.30 లక్షల దాకా వసూలు చేసినట్లు తెలుస్తోంది. వానాకాలం ముగిసి, యాసంగి సీజన్ వచ్చినా ధాన్యం రాకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని మిల్లర్లు అతన్ని అడిగారు. దాంతో సదరు వ్యక్తి మీరు ఇచ్చిన డబ్బులు అధికారులకే ఇచ్చానని, అధికారులు మళ్లీ ఏదో ఒక సీజన్‌లో ధాన్యం కేటాయిస్తారని బుకాయిస్తున్నాడని తెలుస్తోంది. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కొందరు మిల్లర్లు వాదనకు దిగినట్లు సమాచారం. ఆ రూ.30 లక్షలు ఏ అధికారులకు ఇచ్చాడు? అసోసియేషన్‌లోని ఇతర సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అన్నది తేలాల్సి ఉంది. అయితే డబ్బులు వసూలు చేసిన రైస్ మిల్లరును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆ డబ్బులు అసోసియేషన్ కోసం వసూలు చేశామని చెప్పడం కొసమెరుపు. ఈ విషయమై తనకు తెలియదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్చిస్తామని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి చెప్పారు.
నా దృష్టికి రాలేదు
నేను సోమవారం ఇన్‌చార్జి అధికారిగా బాధ్యతలు చేపట్టాను. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. డబ్బులు ఇచ్చిన వారు నా దృష్టికి తెస్తే విచారించి చర్యలు చేపడతా.
- విమల, పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జి అధికారి