వనపర్తికి స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:01 PM
నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తికి స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను మంజూరు చేసిందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

రూ.ఐదు కోట్ల నిధులు మంజూరు
ఆరు లాంగ్‌టర్మ్ కోర్సులు, 23 షార్ట్‌టర్మ్ కోర్సులు
అక్టోబరు 2న ప్రారంభించనున్న ప్రభుత్వం
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, జూలై 8: నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తికి స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను మంజూరు చేసిందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 65 ఐటీఐ సెంటర్లను స్కీల్ డెవల్‌పమెంట్ కేంద్రాలుగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టాటా కంపెనీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగా మొదటి దశలోనే వనపర్తికి స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రం మంజూరు అయ్యింది. రూ.ఐదు కోట్లు కేటాయించారన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,324 కోట్లు కేటాయించారని తెలిపారు. అందులో ఆరు లాంగ్‌టర్మ్ కోర్సులు, 23 షార్ట్‌టర్మ్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ కేంద్రాలను ప్రారంభించేలా ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. అధునాతన మిషనరీ, ఇన్‌స్టక్టర్లు, అధునాతన కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పాటు రోబోటిక్ టెక్నాలజీ రాబోతుందన్నారు. నిరుద్యోగ యువకులకు ఇదొక శుభవార్త అని అన్నారు. మూడు, ఆరు మాసాలతో పాటు సంవత్సరం కోర్సులు ఉంటాయన్నారు. ద్వారా కోర్సు పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులకు టాటా కంపెనీ వారి సహకారంతోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. ఎన్నికలకంటే మందు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ కోసం రూ.22 కోట్ల పెట్టుబడి వనపర్తికి రాబోతుందన్నారు. త్వరలోనే 25 వేల స్వ్కయర్‌ఫీట్లతో నిర్మించే భవనంలో ఐటీ టవర్ ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పారు. ఏడు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఎంప్లాయుమెంట్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు, ఐటీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశంగా ఉంటుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరె రాములు, కోట్ల రవి, నందిమల్ల యాదయ్య, ఎండీ బాబా పాల్గొన్నారు.