Share News

గ్రామాల్లో ‘ఉపాధి’ జాతర

ABN , Publish Date - May 19 , 2024 | 10:49 PM

ఉపాధి హామీ పథకం పనులకు రోజుకు రోజుకూ కూలీల సంఖ్య పెరుగుతోంది.

గ్రామాల్లో ‘ఉపాధి’ జాతర
అన్నసాగర్‌ గ్రామంలో పొలంలో ఒండ్రు మట్టి వేసుకున్న రైతు

- మండలంలో పెరుగుతున్న కూలీల సంఖ్య

- ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి పనులు

దామరగిద్ద, మే 18 : ఉపాధి హామీ పథకం పనులకు రోజుకు రోజుకూ కూలీల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కూలీలు అధికంగా పనిచేస్తున్న మండలంలో దామరగిద్ద రెండో స్థానంలో నిలిచింది. మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లో ఉపాఽధి హామీపనులు జోరుగా కొనసాగుతున్నాయి.

ప్రతీ రోజు 6,775 మంది కూలీలు

మండల వ్యాప్తంగా ప్రతీ రోజు యావరేజ్‌గా 6,775 మందికి పైగానే కూలీలు పనులకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. మండలంలోని మొగల్‌మడ్క, క్యాతన్‌పల్లితో పాటు కానుకుర్తిలో ఎక్కువ మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఫిల్డ్‌ అసిస్టెంట్లు ప్రతీ రోజు ఉపాధి పనుల దగ్గరకు వెళ్లి పనులను పరిశీలిస్తున్నారు. కూలీల సమస్యలు అడగి తెలుసుకుంటున్నారు. ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పని ప్రదేవంలో చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఉపాధి కూలీలకు మొన్నటి వరకు దాదాపు రెండు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండగా నిధులు విడుదలయ్యాయి. బిల్లులు చెల్లింపులు కూడా ప్రతీ వారం జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రస్తుతం చెరువులు, వరద కాలువల్లో పూడికతీత పనులు ఎక్కువగా చేపడుతున్నారు. దీంతో రానున్న వానా కాలంలో నీళ్లు అధికంగా ఇంకి భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న కూలీలు

కూలీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఈ వేసవిలో మొదట 1000 మందితో ప్రారంభమై ప్రస్తుతం 6,775 మంది కూలీలు పని చేస్తున్నారు. కూలి యావరేజ్‌గా రోజుకు రూ.199 నుంచి రూ.300 వరకు పడుతున్నాయి. బిల్లులు కూడా ప్రతీ వారం చెల్లిస్తున్నాము. గతంలో అక్కడక్కడ బీపీఎంలు అందుబాటులో లేకపోవడం వల్ల బిల్లులు లేటుగా ఇచ్చేది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు.

- శ్రీధర్‌, ఎంపీడీవో

Updated Date - May 19 , 2024 | 10:49 PM