Share News

యూనిఫాంలను సిద్ధం చేయాలి

ABN , Publish Date - May 21 , 2024 | 10:58 PM

పాఠశాలలు పునర్‌ ప్రారంభం అనంతరం విద్యార్థులు ఇచ్చేలా యూనిఫాంలను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

యూనిఫాంలను సిద్ధం చేయాలి
యూనిఫాం కుట్టు కేంద్రంలో టైలర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

ఊట్కూర్‌, మే 21 : పాఠశాలలు పునర్‌ ప్రారంభం అనంతరం విద్యార్థులు ఇచ్చేలా యూనిఫాంలను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా స్వశక్తి యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిఫాం క్లాత్‌ కట్టింగ్‌, యూనిఫాం తయారిని పరిశీలించారు. అనంతరం టైలర్లతో తయారి విధానం కట్టింగ్‌, స్టిచ్చింగ్‌ గురించి తెలుసుకున్నారు. సెంటర్‌లో 20 మంది టైలర్లు పని చేస్తున్నారని నిర్వహకులు వివరించడంతో రోజుకు ఒక మహిళ టైలర్‌ ఎన్ని యూనిఫాంలను కుట్టగలుగుతారని అడిగి తెలుసుకున్నారు. టైలర్లతో మాట్లాడి ఒక జత యూనిఫాం కుట్టడానికి ఎంత సమయం పట్టుతుందని అడిగారు. కేంద్రంలో రోజు టైలర్లు కుట్టుతున్న యూనిఫాంలను ఎక్కడ నిల్వచేస్తున్నారని అడిగారు. పూర్తి అయిన యూనిఫాంల స్టిచ్చింగ్‌ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ పని చేస్తున్న టైలర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు ఇతర వసతులను కల్పించాలని నిర్వహకులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాజేశ్వరి, అడిషనల్‌ డీఆర్డీవో అంజయ్య, ఏపీఎం ఇందిరా, మండల మహిళ సమాఖ్య సభ్యులు, టైలర్లు పాల్గొన్నారు.

బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి

నారాయణపేట టౌన్‌ : చిన్న వయస్సులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బేటీ పడావో - బేటీ బచావో, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌, బాల్యవివాహాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో బాల్యవివాహాలు జరిగే మండలాలను గుర్తించి ఆ మండలాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి బాల్య వివాహాలు తగ్గినా ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్లీళ్లు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలో 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల వివరాలను సేకరించి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో అవగాహన కల్పించే అంశాలను తనకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో నరసింహారావు, డీఈవో అబ్దుల్‌ఘనీ, జీసీడీవో పద్మ నళిని పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 10:58 PM