Share News

జిల్లాకు చేరిన యూనిఫాం వస్త్రాలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:17 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అం దించే యూనిఫాంకు సంబంధించిన వస్ర్తాలు జిల్లాకు చేరాయి.

జిల్లాకు చేరిన యూనిఫాం వస్త్రాలు
జిల్లాకు చేరిన యూనిఫాం వస్ర్తాల లోడ్‌ను పరిశీలిస్తున్న డీఈవో, ఇతర అధికారులు

- మండలాల వారీగా పంపిణీకి కసరత్తు

- జిల్లాలో మొత్తం 61,899 మంది విద్యార్థులు

- వారందరికీ జూన్‌ 12న యూనిఫాం, పుస్తకాల పంపిణీ

గద్వాల టౌన్‌, మే 20 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అం దించే యూనిఫాంకు సంబంధించిన వస్ర్తాలు జిల్లాకు చేరాయి. మండలాల వారీగా వస్ర్తాలను పంపిణీ చేసి, ఎంపిక చేసిన మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూని ఫాంలు కుట్టించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభిం చారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది తరగతుల వారీగా విద్యార్థులకు వేర్వేరు నమూనాల్లో యూనిఫాంలు కుట్టిం చేందుకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు. తప్పనిసరిగా అదే మోడల్‌లో యూనిఫాంలను కుట్టించి, విద్యార్థులకు అందించాలని సమగ్ర శిక్ష అభి యాన్‌ అధికారులు ఆదేశించారు. ఒకటి నుంచి మూడు తరగతుల బాలికలకు బాడీ ఫ్రాక్‌లు, షర్ట్‌లకు సంబం ధించి కొలతలతో సహా నిర్దేశించిన రీతిలోనే ఉండాలనే షరతు విధించారు. నాలుగు, ఐదు తరగతుల వారికి కూడా స్కర్టులు, చొక్కాలకు రెండు జేబులు, భుజాలపై క్లాకులు, రెండు చేతులకు క్లిప్పులు ఉండాలని నిబంధన పెట్టారు. ఆరు నుంచి 12 తరగతుల వారికి పంజాబీ డ్రెస్సులు కుట్టించి ఇవ్వాలని ఆదేశించారు. డ్రస్సులకు హ్యాండ్‌ క్లిప్స్‌, కాలర్‌ నెక్‌ పట్టీ, డ్రెస్‌పైన వాస్కోటు ఉండాలని సూచించారు. విద్యార్థులకు ప్యాంట్లు, నిక్కర్లు గతంలో మాదిరిగానే ఉండాలని సూచిస్తూ జిల్లా అధి కారులకు విధివిధానాలతో సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఒకటి నుంచి 10 తరగతుల వరకు 61,899 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా భ్యాసం చేస్తున్నారు. వారిలో బాలురు 31,279, బాలికలు 30,610 మంది ఉన్నారు. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 52,125 మంది కాగా, వారిలో బాలురు 25,990, బాలికలు 26,135 మంది ఉన్నారు. తొమ్మిది, 10 తరగతుల్లో మొత్తం 9,764 మంది విద్యార్థులున్నారు. వారిలో 5,289 మంది బాలురు, 4,475 మంది బాలికలు ఉన్నారు.

మహిళా సంఘాలకు బాధ్యతలు

ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతను జిల్లాలోని మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న సంఘాలను ఆహ్వా నించి, టెండర్లు ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. అనంతరం మండలాల వారీగా యూనిఫామ్స్‌ తయారు చేసే బాధ్యతను డీఆర్‌డీఏ అధికారుల సహకారంతో ఎంఈవోల పర్యవేక్షణలో సిద్ధం చేయించనున్నారు.

3,97,285 పాఠ్యపుస్తకాలు అవసరం

జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి 3,97,285 పాఠ్యపుస్తకాల కోసం ప్రభుత్వానికి ఇండెంట్‌ అందించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 1,95,001 పుస్తకాలు అందుబాటులోకి రాగా, గ్రౌండ్‌ బ్యాలెన్స్‌గా 3,885 పుస్తకాలు ఉన్నాయని, మిగతా పుస్తకాలు త్వరలోనే జిల్లాకు రానున్నాయని తెలిపారు.

తొలిరోజే విద్యార్థులకు యూనిఫాంలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠశాలల పునః ప్రారంభం జూన్‌ 12 నాడే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాము. మహిళా సంఘాల వారితో ప్రత్యేకంగా చర్చించి యూనిఫామ్స్‌ను త్వరితగతిన సిద్ధం చేసేలా సూచిస్తాము. మే నెలాఖరులోగా పాఠ్యపుస్తకాలు సైతం పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది. విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

- ఎం. ఇందిర, జిల్లా విద్యాశాఖ అధికారి

Updated Date - May 20 , 2024 | 11:17 PM