రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:38 PM
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రం సమీపంలోని స్నేహ చికెన్ ఫాం దగ్గర గల 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ వాహనం బోల్తాపడి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.
డివైడర్‌ను ఢీకొన్న ఖాళీ ట్రేలతో వెళ్తున్న డీసీఎం వ్యాను
తర్వాత చేపల లోడుతో వెళుతున్న మరో వాహనానికి ఢీ
అడ్డాకుల సమీపంలో ఘటన
అడ్డాకుల. ఫిబ్రవరి 6 : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రం సమీపంలోని స్నేహ చికెన్ ఫాం దగ్గర గల 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ వాహనం బోల్తాపడి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి కూరగాయాల ఖాళీ ట్రేలతో అనంతపూర్‌కు వెళుతున్న డీసీఎం వ్యాను అడ్డాకులకు సమీపంలోని స్నేహ చికెన్ ఫాం దగ్గర అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు చేపల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యానును బలంగా ఢీకొన్నది. దీంతో కూరగాయల ట్రేలతో వెళుతున్న డీసీఎం డ్రైవర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన సుధాకర్ (41) అక్కడికక్కడే మృతి చెందాడు. చేపల లోడ్‌తో వెళుతున్న డీసీఎం క్లీనర్ హైమద్‌హుస్సేన్ (25)కు తీవ్రగాయాలు కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎల్‌అండ్‌టీ సిబ్బంది మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ క్లీనర్ మృతి చెందాడు. అయితే రోడ్డుపై పడిపోయిన చేపలను, చేపల ట్రేలను స్థానికులు పట్టుకెళ్ళిపోయారు. రెండు డీసీఎంలలో ఎంత మంది ఉన్నారనేది సమాచారం లేదని, మృతుల బంధువులు వస్తేగాని పూర్తి వివరాలు తెలియవని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.